పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో భారత్ క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో 3-2 తేడాతో రొమేనియాపై గెలుపొందింది. దీంతో మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌లతో కూడిన భారత త్రయం ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత జట్టుగా రికార్డ్ సాధించారు. ముందుగా డబుల్స్‌లో ఆకుల శ్రీజ, అర్చనా కామత్ జోడీ అద్భుతంగా ఆడి మూడు గేమ్‌ల్లోనూ ఆధిక్యంలో నిలిచింది. 11-9, 12-10, 11-7తో డయాకోను, సమర ఎలిజబెటాను ఓడించడం వల్ల భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింగిల్స్ మొదటి మ్యాచ్‌లో మనికా బాత్రా చెలరేగిపోయింది. 11-5, 11-7, 11-7తో బెర్నాడెట్టేను చిత్తు చేసింది. ఆ తర్వాత రొమేనియా పుంజుకొని వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి 2-2తో స్కోరును సమం చేసింది. హోరాహోరీగా సాగిన సింగిల్స్ రెండో మ్యాచ్‌లో శ్రీజ 11-8, 4-11, 11-7, 6-11, 8-11 ఎలిజబెటా చేతిలో పోరాడి ఓటమిని చవిచూసింది. మూడో మ్యాచ్‌లో అర్చనా కామత్ 5-11, 11-8, 7-11, 9-11 బెర్నాడెట్టే చేతిలో ఓడిపోయింది. ఫలితాన్ని తేల్చే ఐదో మ్యాచ్‌లో డయాకోనుపై తొలి గేమ్‌లో మనికా 11-5తో సునాయసంగా విజయం సాధించింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా 11-9తో గెలిచింది. కీలకమైన మూడో గేమ్‌లో మనికా 0-2తో వెనుకబడినా 8-5తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత ప్రత్యర్థి జోరు పెంచడం వల్ల విజయంపై ఉత్కంఠ నెలకొంది. చివరకు మనికా 11-9తో మూడో గేమ్‌ను సొంతం చేసుకోవడం వల్ల భారత్ క్వార్టర్స్‌కు చేరింది.