టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు ఇటీవలే బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. టీ20లు, వన్డేల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించింది. తొలి సిరీస్‌లోనే అతడు ఈ రోల్లో ఆకట్టుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా కన్సిస్టెంట్గా రన్స్ చేయడం, మూడు ఫార్మాట్లలోనూ నమ్మదగిన ఆటగాడిగా ఎదగడం, ఎంత ఒత్తిడిలోనూ కూల్‌గా ఉండగలగడం, ఓపికతో ఉంటూ అందరితో కలసిపోవడం లాంటి లక్షణాల్ని చూసి అతడికి ప్రమోషన్ ఇచ్చింది బోర్డు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉండటం కూడా అతడికి కలిసొచ్చింది. శ్రీలంక సిరీస్‌తో వైస్ కెప్టెన్సీ బాధ్యతల్ని చేపట్టిన గిల్ మిక్స్డ్ రిజల్ట్స్ చూస్తున్నాడు.
'రోహిత్-విరాట్లు నాకు స్ఫూర్తి. వాళ్లే నాకు రోల్ మోడల్స్. ఆ ఇద్దరి మాదిరిగా ఫుల్ ఇంటెన్సిటీతో ఆడుతూ భారత్‌కు ఎన్నో విజయాలు అందించాలని అనుకుంటున్నా. ఈ ఆలోచనే నన్ను బాగా ఆడేందుకు ప్రేరేపిస్తోంది' అని గిల్ చెప్పుకొచ్చాడు. రోహిత్ సారథ్యంలో మ్యాచులు ఆడటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపాడు. హిట్‌మ్యాన్‌తో పాటు మహేంద్ర సింగ్ ధోని, కోహ్లీ లాంటి దిగ్గజాలు భారత జట్టుకు నాయకత్వం వహించారని.. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు గిల్. కెప్టెన్సీ అంటే తనకు ఇష్టమని.. ఆ రోల్లో ఉంటే గేమ్‌ను మరింత ఆస్వాదించొచ్చని వివరించాడు. ఇక, లంకతో వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో 16 పరుగులు చేసిన గిల్.. రెండో వన్డేలో 35 పరుగులు చేశాడు. అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. సిరీస్ డిసైడర్‌లో అతడు చెలరేగుతాడేమో చూడాలి.