పారిస్ 2024 ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం తీసుకొస్తుందనే అంచనాతో బరిలోకి దిగిన ఆర్చర్ దీపికా కుమారి మరోసారి నిరాశపర్చారు. దక్షిణా కొరియాకు చెందిన నామ్ సుహ్యెన్‌తో 4-6తేడాతో ఓడిపోయి.. వరుసగా రెండో ఒలింపిక్‌లో క్వార్టర్స్ నుంచి నిష్క్రమించారు. టోక్యో 2020 ఒలింపిక్స్‌లోన దీపికా క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడిపోయారు. ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ పోటీల్లో పాల్గొన్న ఆమె.. ఒక్క పతకం కూడా తేలేకపోయారు. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల దీపికా సంచలన ప్రకటన చేశారు. పారిస్‌లో తన పోరాటం ముగిసిన తర్వాత వచ్చే ఒలింపిక్స్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒలింపిక్స్‌లో పతకం సాధించే వరకు ఆర్చరీని వదలోబోనని దీపికా కుమారి శపథం చేశారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో తాను చేసిన తప్పులను సరిదిద్దుకుని.. మరో నాలుగేళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్‌లో సత్తాచాటుతానని.. కచ్చితంగా మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో పోడియంపైకి ఎక్కే వరకు ఆర్చరీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ‘నేను భవిష్యత్‌లో కచ్చితంగా ఆటను కొనసాగిస్తా. నాలుగేళ్ల తర్వాత లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పతకం గెలవాలని అనుకుంటున్నా. అప్పటివరకు నేను రిటైర్మెంట్ ప్రకటించబోను. ఇప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకుంటా. ఇందుకోసం ఎంతైన కష్టపడతా. వచ్చే ఒలింపిక్స్ కోసం బలంగా తిరిగి వస్తా’ అని దీపికా కుమారి చెప్పారు.
‘ఈ ఒలింపిక్స్‌లో చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా లేట్‌గా బాణం వదలడం అన్నది నాపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీన్ని సరిచేసుకుంటే, నా ప్రదర్శన మెరుగవుతుంది. దీన్ని అధిగమించేందుకు నిరంతరం సాధన చేస్తా’ అని దీపికా కుమారి వ్యాఖ్యానించారు. ఆర్చర్ దీపికా కుమారి ఇప్పటివరకు నాలుగు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. పారిస్‌తో పాటు.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్ ఫైనల్‌లోనే నిష్క్రమించారు. వాస్తవానికి 2022 డిసెంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన దీపికా.. ఆ తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు కఠోర సాధన చేశారు. జాతీయ సెలక్షన్స్‌లో అగ్రస్థానం సాధించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో షాంఘైలో జరిగిన ప్రపంచకప్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో బలమైన పోటీదారుగా బరిలో నిలిచారు. అనుకున్నట్లుగానే క్వార్టర్స్ వరకూ చేరారు. కానీ, ఇక్కడ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఫలితంగా మరోసారి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. మరి వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానని.. శపథం చేసిన దీపికా తన మాటను నిలబెట్టుకుంటారా? తన మెడలో తొలి ఒలింపిక్ మెడల్ వేసుకుంటారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.