ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దటీజ్‌ కోహ్లీ.. జెర్సీ, గ్లవ్స్‌కు వేలంలో రూ. 68 లక్షలు, ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ

sports |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 08:09 PM

విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ రన్‌ మెషీన్‌కు కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన భారతీయుడిగా అతడు నిలిచాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 270 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. పాకిస్థాన్‌లోనూ అతడంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారు. భారత జట్టు, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ కోహ్లీ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇదే విషయం మరోసారి స్పష్టమైంది.


చారిటీ కోసం ఇటీవల కేఎల్‌ రాహుల్‌ - అతియా శెట్టి దంపతులులు నిర్వహించిన ఓ వేలంలో కోహ్లీ వస్తువులకు రికార్డు స్థాయిలో ధర లభించింది. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ నటి అతియా శెట్టి దంపతులు.. దివ్యాంగ చిన్నారుల సంక్షేమం కోసం ఇటీవల ముంబైలో ఓ ఫండ్ రైజింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థుల కోసం ‘క్రికెట్ ఫర్ ఎ కాజ్’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వచ్చిన మొత్తాన్ని విప్లా అనే ఫౌండేషన్‌కు అందించనున్నట్లు ప్రకటించారు.


విప్లా ఫౌండేషన్‌.. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ స్కూల్‌ నడుపుతోంది. చిన్నప్పటి నుంచి ఈ ఫౌండేషన్‌తో అతియా శెట్టికి మంచి అనుబంధం ఉంది. వీలైనప్పుడల్లా అందులో చిన్నారులతో గడిపేదాణ్ని ఆమె ఇటీవల చెప్పారు. ఈ ఫౌండేషన్‌ను తన నానమ్మ ప్రారంభించిందని.. దానికి మద్దతుగా ఉండాలని భావిస్తున్నానని అతియా శెట్టి పేర్కొంది. ఆమెకు కేఎల్‌ రాహుల్ సైతం సహకరించాడు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్‌ క్రికెటర్ల వస్తువులను వేలం వేయాలని నిర్ణయించుకున్నారు.


ఇటీవల జరిగిన ఈ వేలంలో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ వాడిన జెర్సీ, గ్లవ్స్ అత్యధిక ధర పలికాయి. రోహిత్ శర్మ, ధోనీ వాడిన బ్యాట్‌ల కంటే కూడా ఎక్కువ రేటు పలికాయి. ఈ వేలంలో అత్యధిక ధర కోహ్లీ జెర్సీకే దక్కింది. ఏకంగా రూ. 40 లక్షలు పలికింది. అంతేకాకుండా కోహ్లీ వాడిన బ్యాటింగ్ గ్లవ్స్‌ సైతం రూ. 28 లక్షలకు అమ్ముడయ్యాయి. అత్యధిక ధర పలికిన వస్తువుల్లో రోహిత్ శర్మ వాడిన క్రికెట్‌ బ్యాట్‌ మూడో ప్లేసులో నిలిచింది. దానికి రూ. 24 లక్షలు వచ్చాయి.


ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ రూ. 13 లక్షలు పలకగా.. టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ బ్యాట్ రూ. 11 లక్షలు, కేఎల్‌ రాహుల్ జెర్సీ రూ. 11 లక్షలు పలికాయి. మొత్తంగా ఈ వేలం కార్యక్రమం ద్వారా కేఎల్‌ రాహుల్-అతియా శెట్టి దంపతులు మొత్తం రూ. 1.93 కోట్లు సేకరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com