హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ, దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ అయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మెగా ఐపీఓ తర్వాత ఆ స్థాయి అంచనాలున్న ఎన్‌బీఎఫ్‌సీగా నిలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించిన తప్పనిసరి లిస్టింగ్ రూల్స్ ప్రకారం త్వరలోనే ఈక్విటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద డ్రాఫ్ట్ డాక్యుమెంట్లను దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
మరోవైపు.. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు దాని మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత వారమే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.2500 కోట్లు విలువైన తాజా షేర్ల జారీతో పాటు ఇప్పటికే ఉన్న వాటాదార్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్లు విక్రయించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్‌బీఐ లిస్టింగ్ రూల్స్ చేరుకోవడంతో పాటు తమ వ్యాపార వృద్ధికి నిధుల సమీకరణ కోసం ఇది ఒక మార్గంగా కంపెనీలు చూస్తున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
పీవీసీ బ్లెండ్ ఆధారిత బిల్డింగ్ మెటీరియల్ ఉత్పత్తులు తయారు చేసే సంస్థ కుమార్ ఆర్క్ టెక్ పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ సంస్థ రూ.740 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను సైతం దాఖలు చేసిందట. ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో రూ.240 కోట్ల తాజా షేర్లు జారీ చేయగా.. రూ.500 కోట్లు విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2018లో ఐఎల్ అండే ఎఫ్ఎస్, ఆ తర్వాత డీహెచ్ఎఫ్ఎల్ దివాలా తీశాయి. ఈ క్రమంలో రివైజ్డ్ స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది ఆర్‌బీఐ. దీన ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను 4 లేయర్ల కింద వర్గీకరించింది. పరిమాణం, కార్యకలాపాలు, రిస్క్ ఆధారంగా బేస్ లేయర్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్, టాప్ లేయర్లుగా విభజించింది. అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలు మూడేళ్లలోపు స్టాక్ మార్కెట్లలో నమోదు కావాల్సి ఉంటుంది.