కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో మొమినుల్ హక్ అజేయ శతకం (107 నాటౌట్)తో రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో బంగ్లా జట్టు తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ శాంటో (31), ఇస్లామ్ (24), మెహదీ హసన్ మిరాజ్ (20) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, సిరాజ్, అశ్విన్ చెరో 2 వికెట్లు తీశారు. రెండు రోజులపాటు ఆట వర్షార్పణం కాగా, ఇవాళ నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోర్ 107/3తో ఆటను కొనసాగించిన బంగ్లా 233 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ సేన వన్డే మాదిరి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మూడు ఓవర్లలోనే 50 పరుగులు బాదారు. ఈ జోడి 23 బంతుల్లోనే 55 పరుగుల భాగస్వామ్యం అందించడం విశేషం. ధాటిగా ఆడే క్రమంలోనే రోహిత్ (23) తన వికెట్ కోల్పోయాడు. మరోవైపు జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో బంగ్లా బౌలర్లను భయపెడుతున్నాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ కోల్పోయి 90 పరుగులు చేసింది. క్రీజులో గిల్ (10), జైస్వాల్ (55) ఉన్నారు.