భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు వెలవెలపోయాయి. మదుపరులు తీవ్రస్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 1,272 పాయింట్ల నష్టంతో 84,299 వద్ద ముగియగా... నిఫ్టీ 368 పాయింట్ల నష్టంతో 25,810 వద్ద స్థిరపడింది. బ్యాకింగ్ షేర్లు ఇవాళ కళ తప్పాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐతో పాటు... రిలయన్స్, నెస్లే, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా నష్టాల బాటలో పయనించాయి. జేఎస్ డబ్ల్యూ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ లో మదుపరుల సంపద రూ.3.96 లక్షల కోట్లు నష్టపోయి రూ.473.97 లక్షల కోట్లకు పడిపోయింది. ఇవాళ్టి ట్రేడింగ్ ను పరిశీలిస్తే... విదేశీ సంస్థాగత మదుపరులు తమ దృష్టిని చైనా స్టాక్ మార్కెట్ వైపు మళ్లించారు. ఇటీవల చైనా ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చర్యలు విదేశీ మదుపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.