మీకు ఏదైనా అత్యవసరం ఏర్పడి పర్సనల్ లోన్ తీసుకువాలనుకుంటున్నారా? దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా వ్యక్తిగత రుణాలు పొందవచ్చు. అయితే బ్యాంకును బట్టి వడ్డీ రేట్లు, నిబంధనలు మారుతుంటాయి. అందుకే మీ ఆర్థిక పరిస్థిని బట్టి లోన్ తీసుకోవడం, తిరిగి చెల్లించే ప్రక్రియను ఎంచుకోవడం మంచిది. మీ సామర్థ్యానికి మించి నెలవారీ కిస్తి ఎంచుకుంటే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అందుకే పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా నెలవారీగా ఎంత చెల్లించాల్సి వస్తుందనేది ముందుగానే తెలుసుకోవడం మంచిది. మీరు రూ.10 లక్షల లోన్ తీసుకుంటున్నారు అనుకుందాం. అప్పుడు మీరు నెలకు ఈఎంఐ ఎంత కట్టాలో ముందుగానే నిర్ణయించుకోవడం ద్వారా అదనపు భాన్ని తగ్గించుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా లభించే ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా నెలకు ఎంత ఈఎంఐ పడుతుంది అనేది నిర్ణయించుకోవచ్చు. అయితే, అందుకు మొత్తం ఎంత లోన్ తీసుకుంటున్నారు, వడ్డీ రేటు ఎంత, లోన్ తిరిగి చెల్లించే టెన్యూర్ ఎంత ఎంచుకుంటున్నారు? అనే వివరాలు అవసరమవుతాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను సంప్రదించినప్పుడు మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యాలను బట్టి మీకు వడ్డీ రేటును బ్యాంకులు నిర్ణయిస్తాయి. దాని ద్వారా మీరు లెక్కించుకుని ఏ బ్యాంకులో తక్కువ భారం పడుతుందో అందులో లోన్ తీసుకోవడం మంచిది.
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.10 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు అనుకుందాం. ఇందులో ప్రస్తుతం వడ్డీ రేట్లు 11 శాతం నుంచి 18 శాతం వరకు ఉన్నాయి. అలాగే లోన్ టెన్యూర్ ఏడాది నుంచ 5 ఏళ్ల వరకు ఉంది. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండి, బ్యాంకుతో మంచి అనుబంధం ఉన్నట్లయితే కనిష్ఠ వడ్డీ రేటుకే లోన్ ఇచ్చే అవకాశం ఉంది. మీకు బ్యాంకు 12 శాతం వడ్డీ రేటు ఫిక్స్ చేసింది అనుకుందాం అప్పుడు ఆన్‌లైన్ ఎస్‌బీఐ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా ఈఎంఐ తెలుసుకోవచ్చు.
మీరు 3 ఏళ్లలో అంటే 36 నెలల్లో లోన్ తిరిగి చెలిస్తారని టెన్యూర్ ఎంచుకున్నారు అనుకుందాం. అప్పుడు మీకు నెలవారీ ఈఎంఐ రూ.33,214 వరకు చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఎంచుకున్నారు అనుకుందాం. అప్పుడు ఈఎంఐ రూ.22,244 పడుతుంది. మొత్తం మీరు చెల్లించే వడ్డీ రూ.3,34,667 వరకు అవుతుంది. అంటే రూ.10 లక్షల లోన్‌కు రూ.13,34,667 వరకు చెల్లించాల్సి వస్తుంది. దీని ప్రకారం మీరు ఎంచుకునే టెన్యూర్, వడ్డీ రేటు ఆధారంగా మీ ఈఎంఐ అనేది మారుతుంటుంది. ఇది ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లకు మాత్రమే వర్తిస్తుంది. అదే మీరు ఫ్లోటింగ్ రేట్ వడ్డీ ఎంచుకుంటే వడ్డీ రేట్లు మారినప్పుడల్లా మీ ఈఎంఐ మారుతుంటుంది.