రతన్ టాటా మరణానంతరం ఆయన వారసుడిగా టాటా గ్రూప్ బాధ్యతలను ఎవరు చేపడతారనే ప్రశ్నకు తెరపడింది. టాటా ట్రస్టులకు ఛైర్మన్‌గా, రతన్ టాటా వారసుడిగా 67 ఏళ్ల నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఇంతకీ ఈ నోయల్ టాటా ఎవరు? కంపెనీలో ఆయన ప్రస్థానం ఏటి అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికీ టాటా గ్రూప్‌లో పెద్ద బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఆయన పేరు పెద్దగా వార్తల్లో కనిపించలేదు. ఆర్భాటాలకు దూరంగా ఉంటారని కంపెనీ వర్గాలు చెబుతుంటాయి. మరి ఆయన రతన్ టాటాకు ఏమవుతారు? అనే కొన్ని విషయాలు తెలుసుకుందాం.
రతన్ టాటాకు సోదరుడు..
నావల్ టాటాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సూని కుమారుడు రతన్ టాటా, జిమ్మి టాటా. 1940లో నావల్ టాటా, సూనీ టాటాలు విడిపోయారు. 1955లో సిమోనే అనే స్విస్ వ్యాపావేత్తను నావల్ టాటా పెళ్లి చేసుకున్నారు. వారికు జన్మించిన వాడే ఈ నోయల్ టాటా. రతన్ టాటాకు సవతి సోదరుడు. నోయల్ టాటా సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందారు. INSEAD నుంచి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు. విదేశాల్లో బిజినెస్ చేసే టాటా ఇంటర్నేషనల్ సంస్థలో నోయల్ టాటా తన కెరీర్ ప్రారంభించారు.
టాటా గ్రూప్ రిటైల్ విభాగమైన ట్రెంట్ బోర్డులో 1999లో చేరారు. ట్రెంట్ సంస్థలను నోయల్ టాటా తల్లి సిమోనే స్థాపించడం గమనార్హం. నోయల్ టాటా వచ్చాక ఆ కంపెనీ లిటిల్ ఉడ్స్‌ను కొనుగోలు చేసింది. 2003లో టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2010 నాటికి టాటా ఇంటర్నేషనల్ ఎండీ స్థాయికి ఎదిగారు. నోయల్ హయాంలో 500 మిలియన్ డాలర్ల వ్యాపారం నుంచి 3 బిలియన్ డాలర్ల స్థాయికి కంపెనీ చేరింది. ప్రస్తుతం ట్రెంట్ సంస్థకు 700 బ్రాంచీలు ఉన్నాయి.
కీలక బాధ్యతల్లో..
ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు నోయల్ టాటా. టాటా ఇంటర్నేషనల్ సంస్థకు ఎండీ సైతం ఆయనే. అలాగే టైటాన్, టాటా స్టీల్‌కు వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. వోల్టాస్ బోర్డు సభ్యుడు కూడా. రతన్ టాటా తర్వాత ఆ బాధ్యతలు నోయల్ టాటా చేతికే వస్తాయని దశాబ్ద కాలం నుంచే ప్రచారం జరుగుతున్నా.. మధ్యలో సైరస్ మిస్త్రీ వచ్చారు. శ్రీదోరబ్జి టాటా, శ్రీ రతన్ టాటా ట్రస్టుల్లో ఆయన ట్రస్టీగా ఉన్నారు. సేవా కార్యక్రమాలను ఆయనే పర్యవేక్షిస్తారు.
పల్లోంజి మిస్త్రీ కుమార్తెనే నోయల్ భార్య ఆలూ. టాటా గ్రూప్‌లో ఈ పల్లోంజి కుటుంబానికి పెద్ద మొత్తంలో వాటాలు ఉన్నాయి. వీరికి ముగ్గురు సంతానం. కుమార్తెలు లేహ టాటా, మాయా టాటా, కుమారుడు నెవిల్లే టాటా. వీరందరికీ టాటా ట్రస్టులో సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఇండియన్ హోటల్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా లేహ టాటా వ్యవహరిస్తున్నారు. ట్రింట్, స్టార్ బజర్ లీడర్‌షిప్ టీమ్‌లో మాయా టాటా ఉన్నారు. స్టాక్ బజార్, జుడియోను నెవిల్లే టాటా పర్యవేక్షిస్తున్నారు. ఇక కిర్లోస్కర్ కుటుంబానికి చెందిన మానసిని నెవిల్లే టాటా పెళ్లి చేసుకున్నారు.