కంపెనీ కోసం పాటు పడుతున్న ఉద్యోగుల కోసం పండగలు, ప్రత్యేక సందర్భాల్లో కానుకలు ఇస్తుంటారు. అలాగే వార్షిక బోనస్, పండగ బోనస్ అంటూ ఇస్తుండడం తెలిసిందే. అయితే, తమ కంపెనీని విజయవంతంగా నడిపించడంలో ఉద్యోగులు చేస్తున్న కృషికి గుర్తింపుగా చెన్నైకి చెందిన ఓ కంపెనీ ఓ అడుగు ముందుకేసి ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలోని పలువురు ఉద్యోగులకు మెర్సిడేస్ బెంజ్, హ్యూందాయ్ వంటి లగ్జరీ కార్లు, బైకులు దీపావళి కానుకగా ఇచ్చింది. కంపెనీని మరింత విజయవంతంగా నడిపించేలా ప్రోత్సహించేందుకే ఈ కానుకలు అందించినట్లు కంపెనీ తెలిపింది. అదే టీమ్ డిటెయిలింగ్ సొల్యూషన్స్ సంస్థ.
దీపావళి కానుకలో భాగంగా మొత్తం 28 మంది లగ్జరీ కార్లు అందించగా.. మరో 29 మంది ఉద్యోగులకు బైకులు ఇచ్చింది. కార్లలో హ్యూందాయ్, టాటా, మారుతీ సుజుకీ, మెర్స్‌డేస్ బెంజ్ వంటి కంపెనీలు ఉన్నాయి. కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వారిని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఎండీ శ్రీధర్ కన్నన్ తెలిపారు. ఉద్యోగులే తమకు విలువైన ఆస్తిగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమ కంపెనీలో 180 ఉద్యోగులు పని చేస్తున్నారని వెల్లడించారు. అందులో చాలా మందికి కారు, బైక్ కొనుగోలు చేయాలన్న ఆశ ఉంటుందని, ఆ కల నెరవేర్చేందుకు వీటిని దీపావళి కానుకలుగా అందించినట్లు చెప్పారు.
ఉద్యోగులకు మరో బంపర్ ఆఫర్ సైతం చెప్పారు ఎండీ శ్రీధర్ కన్నన్. కంపెనీ అందించిన కారు కాకుండా అంతకన్నా మంచి వాహనం కొనుగోలు చేయాలని ఉద్యోగికి అనిపిస్తే మిగిలిన డబ్బులను సైతం చెల్లిస్తామని, దాంతో సదరు ఉద్యోగి తమకు నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చన్నారు. గతంలో ఉద్యోగులకు వివాహ వేడుకకు సాయంగా రూ. 50 వేలు చెల్లించే వారమని, ఇప్పుడు దానిని రూ. 1 లక్షకు పెంచుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైకులు పండగ గిఫ్ట్స్‌గా ఇవ్వడంపై కంపెనీపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు.