ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా టెక్ కంపెనీలన్నీ ఒకేదారిలో

business |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 11:33 PM

దేశీయ ఐటీ, టెక్ రంగంలోని కంపెనీలు వేగంగా పుంజుకుంటున్నాయి. కోవిడ్ తర్వాత వ్యయ నియంత్రణల పేరుతో ఉద్యోగులను భారీగా తగ్గించుకున్న సంస్థలు ఇప్పుడు మళ్లీ నియామకాలకు మొగ్గు చూపుతున్నాయి. దేశంలోని టాప్-6 ఐటీ కంపెనీల్లో 5 కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 17,500 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. టాప్ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐ మైండ్ ట్రీ ఉన్నాయి. సుమారు 7 త్రైమాసికాలు అంటే దాదాపు రెండేళ్ల తర్వాత భారత ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల ట్రెండ్ మారింది. 250 బిలియన్ డాలర్ల భారత ఐటీ రంగం పుంజుకుంటోందని అనేందుకు ఇదే నిదర్శనమని టెక్ నిపుణులు చెబుతున్నారు.


అయితే, దేశీయ టాప్ కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో 780 మంది తగ్గారు. అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్‌తో ఉన్న జాయింట్ వెంచర్‌ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టిన క్రమంలోనే ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ 2024 తొలినాళ్లలో భారతీయ ఐటీ కంపెనీలు మొత్తంగా 70 వేల మంది ఉద్యోగులను తొలగించడం గమనార్హం. అయితే, ఈ ఆర్థిక ఏడాది 2024 ఏప్రిల్ తర్వాత మాత్రం భారీగా తగ్గింది. తొలి త్రైమాసికంలో కేవలం 1750 మందిని మాత్రమే తొలగించాయి. రెండు త్రైమాసికాల్లో కంపెనీలకు మంచి డీల్స్ వచ్చిన క్రమంలో ఉద్యోగుల నియామకాలు ఊపందుకున్నాయి. జులై, ఆగస్టు నెలల్లో టాప్ 4 కంపెనీలు 33 డీల్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.


దేశంలోని 5వ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న టెక్ మహీంద్రా ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో ఫ్రెషర్ల నియామకాలు చేపట్టింది. కొత్తగా 6,653 మంది ఉద్యోగులను తీసుకుంది. ఆ తర్వాత దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సెప్టెంబర్ త్రైమాసికంలో 5,726 మంది ఉద్యోగులను నియమించుకుంది. వీటి తర్వాత చూసుకుంటే దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 2,456 మంది, నాలుగో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో 978 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకున్నాయి.


బెంగళూరు ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న ఇన్ఫోసిస్ వరుసగా 6 త్రైమాసికాల తర్వాత తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం గమనార్హం. అలాగే 2022, 2023 నుంచి క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు చేసిన వారిని సైతం ఆన్‌బోర్డింగ్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు ప్రకటించాయి. 2024లో మూడు త్రైమాసికాల్లో కంపెనీలు మంచి డీల్స్ సొంతం చేసుకున్నాయి. టీసీఎస్ 8.6 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇన్పోసిస్ 2.4 బిలియన్ డాలర్లు, హెచ్‌సీఎల్ టెక్, విప్రోలు వరుసగా 2.2 బిలియన్ డాలర్లు, 2.4 బిలియన్ డాలర్ల డీల్స్ అందుకున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com