అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీ అంశం చర్చకు వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వేసిన ఓ ప్రశ్నకు లోకేష్ సమాధానం చెబుతూ డీఎస్సీ 2024 ఆలస్యానికి కారణాలు చెప్పారు.
విష్ణుకుమార్ రాజు ఏం అడిగారు?
విష్ణుకుమార్ రాజు వేసిన ప్రశ్నకు మంత్రిలోకేష్ సమాధానం చెబుతూ డీఎస్సీపై కీలక అప్డేట్ ఇచ్చారు. 1998 డీఎస్సీలో అన్యాయమైపోయిన వారికి ఇంత వరకు ఉద్యోగాలు రాలేదని వారికి న్యాయం చేయాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ వారి సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. అయితే 2018 ఆఖరిలో ఓ కమిటీ వేసి న్యాయం చేయాలని చూశారు కానీ ప్రభుత్వం మారడంతో న్యాయం జరగలేదన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అందులో కొందరికి వారిలో కొందరికి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మిగతా వారికి కూడా సహాయం చేయాలని అభ్యర్థించారు.
లోకేష్ ఏం సమాధానం చెప్పారు?
దీనిపై సమాధానం చెప్పిన మంత్రి లోకేష్.... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 11 డీఎస్సీలు తీసిందన్నారు. లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులను నియమించారన్నారు. అందుకే ఈసారి కూడా తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్పైనే పెట్టారని గుర్తు చేశారు. తన నెంబర్ రాష్ట్రంలోని చాలా మంది ప్రజలకు తెలుసునని... అందకే డీఎస్సీపై తనకే నేరుగా మెసేజ్లు పెడుతున్నారని అన్నారు.
నేరుగా మెసేజ్లు చేస్తున్నారు: లోకేష్అ
భ్యర్థుల విజ్ఞప్తి మేరకే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందే టెట్ పెట్టామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అందులో 16వేలకుపైగా పోస్టులు భర్తీచేయబోతున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు.
1998 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తాం: లోకేష్ఉద్యోగ కల్పన ఓ లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టే యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నామన్నారు లోకేష్. 1998 డీఎస్సీకి సంబంధించి గత ప్రభుత్వం 4534 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందని అందులో 3939మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిందన్నారు. ఇంకా 600 ఖాళీలు ఇంకా ఉన్నాయన్నారు. వాటి వివరాలు తీసుకొని వారి సమస్య ఎలా పరిష్కరించాలో చేస్తామన్నారు. మినిమం టైం స్కేల్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తించని అన్నారు. వారి రిటైర్మెంట్ ఏజ్ విషయంలో అధికారులతో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకోగలమని పేర్కొన్నారు.
కోర్టులు చిక్కులు ఉండకూడదనే డీఎస్సీ 2024 వాయిదా: లోకేష్
డీఎస్సీపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయి, ఎందుకు కేసులు పడ్డాయి, ఇందులో ప్రభుత్వమే లిటిగెంట్ అవుతుందని అలాంటి పరిస్థితి రాకూడదనే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు లోకేష్. గతంలో పడిన కేసులు ఇతర అంశాలు స్టడీ చేసి పకడ్బంధీగా నోటిఫికేషన్ వేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈసారి వేసే నోటిఫికేషన్ మరోసారి న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఉన్నాం. అందుకే టైం పడుతుందన్నారు. కచ్చితంగా త్వరలోనే మంచి నోటిఫికేషన్ వస్తుందని మాట ఇచ్చారు.