ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజమహేంద్రవరం- అనకాపల్లి, రాయచోటి - కడప జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సీఎం రమేష్ వెల్లడించారు. ఈ రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. 16వ నంబర్ జాతీయ రహదారిలో రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకూ ఉన్న 4 వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకరించినట్లు చెప్పారు.
మరోవైపు16వ నంబర్ నేషనల్ హైవే పరిధిలోని అనకాపల్లి-అన్నవరం-దివాన్ చెరువు రూట్లో.. 741.255 కిలోమీటర్ల దగ్గర నుంచి 903 కిలోమీటర్ల వరకూ నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు లేన్లకు విస్తరించనున్నారు. ఈ రహదారి పనుల విస్తరణ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సంబంధిత కన్సల్టెంట్‌కు అందజేసినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. అలాగే 40వ నంబర్ జాతీయ రహదారిపై రాయచోటి - కడప మార్గంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం లభించినట్లు చెప్పారు. ఈ మార్గంలో టన్నెల్ కూడా నిర్మించనున్నట్లు సీఎం రమేష్ వెల్లడించారు. అయితే టన్నెల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు అవసరమన్న ఎంపీ సీఎం రమేష్.. అటవీ శాఖ నుంచి అనుమతులు రాగానే ఈ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు,
మరోవైపు కేంద్రంలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్డీఏ కూటమి సర్కారు కొలువుదీరటంతో.. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు వేగం పుంజుకుంటున్నాయి. రహదారి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే పలుచోట్ల విస్తరణ పనులకు కేంద్రం ఆమోదం లభించింది. అలాగే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పనులకు కూడా కేంద్రం ఆమోదం లభించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏడుచోట్ల నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్, తుని, ఒంగోలు, మూలపేటలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆ రకంగా రెండుచోట్ల ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మౌలిక వసతుల నిర్మాణ పనులు జోరందుకోనున్నాయి.