ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో కూటమి ప్రభుత్వం మరో డ్రామాకు తెర లేపిందని వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చాక పథకాలను అమలు చేయడంలేదన్నారు. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ.. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో కార్పొరేషన్లలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరు నెలల కాలంలో చేసిందేమీ లేదు.
రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ.. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రారంభించి చివరి దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి. లేనిపక్షంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏపీలో కూటమి నేతలు స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెర లేపారు. గతంలో వైయస్ జగన్‌పై కూటమి నేతలు నిందలు వేశారు. దానికి ఇప్పుడు ఏ సమాధానం చెబుతారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. ఆ పథకాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఎన్నికల ముందు ఉదయం అవ్వగానే పథకాల గురించి ఫోన్లు చేసి వివరించారు. పథకాలు ఎవరెవరికి అందాయి ఇప్పుడు ఫోన్లు చేసి కనుక్కోండి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయి. మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చి నిజాయితీ నిరూపించుకోండి. లయోలా కాలేజీ వాకర్స్ కు గద్దె రామ్మోహన్ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. వాళ్లని రెచ్చగొట్టి ఇప్పుడు కేసుల్లో ఇరికించారు. లయోలా కాలేజ్ యాజమాన్యానికి వాకర్స్‌ని అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రజలను నమ్మించారు. వారికి న్యాయం చేయండి. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం’ అని చెప్పారు.