ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఇకపై అక్కడా దర్శన టికెట్లు ఇస్తారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 09:01 PM

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్‌ను ఏఈవో ప్రారంభించారు. కౌంటర్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్‌ను కేటాయించారు. గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించినట్లు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. అందుకే ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చన్నారు వెంకయ్య చౌదరి. ప్రతి రోజూ 900 శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుంచి నాలుగు నిమిషాలు పట్టేదని.. ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సురేంద్ర, ఏఈవో కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


మరోవైపు తిరుమలలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా నిర్వహించారు. వేకువజామున 4.30 నుంచి 5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భక్తులకు అభయం ఇచ్చారు. అక్కడక్కడా చిరు జల్లులు కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయర్‌స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


'పురాణాల ప్ర‌కారం శ్రీ వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది' అని చెబుతారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com