కాగితాలు ఏరుకునే వాళ్లే కదా అని లైట్ తీసుకోకండి.. వాళ్లు మామూలోళ్లు కాదంటున్నారు పోలీసులు. కొద్దిరోజులుగా జరుగుతున్న చోరీలపై నిఘా పెడితే వాళ్లు చేస్తున్న ఘనకార్యం మొత్తం బయటపడింది. వీళ్ల గురించి ఆరా తీస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి. గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల కాలంలో కొత్త తరహా చోరీలు జరుగుతున్నాయి. పట్టపగలే ఇళ్లలోకి చొరబడి వస్తువుల్ని మాయం చేస్తున్నారు. ఇలా గత రెండు రోజుల వ్యవధిలో రెండు ఘటనల్లో ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెనాలిలోని తోట వారి వీధిలో మల్లిఖార్జున శర్మ ఘనాపాఠి ఇల్లు ఉంది. ఆయన పురోహితుడు కావడంతో యజ్ఞం నిర్వహించేందుకు గత నెల 31న ఊరికి వెళ్లారు. ఆ మరుసటి రోజు శర్మ ఇంటి గ్రిల్స్ తీసి ఉండటాన్ని స్థానికులు గమనించారు.. అనుమానం వచ్చి వెంటనే శర్మకు సమాచారం అందించారు. ఆయన ఇంటికి వచ్చి తలుపులు తీసి చూశారు.. అయితే విలువైన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే అదే ప్రాంతంలో ఇద్దరు మహిళలు చిత్తు కాగితాలు ఏరుకుంటున్నారు. అయితే వారిద్దరి తీరుపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.. అప్పుడు వాళ్లిద్దరు నిజం ఒప్పుకున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన రోశమ్మ, మహంకాళిలు చిత్తు కాగితాలు ఏరుకుని ఉపాధి పొందుతున్నారు. వీరిద్దరు చిత్తు కాగితాలు ఏరుకుంటగా.. శర్మ ఇల్లు కంటపడింది. అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గమనించి గోడ దూకి ఇంటిలోకి వెళ్లారు. ఇనుప రాడ్డు సాయంతో తాళం పగుల కొట్టి.. లోపలికి వెళ్లి ట్రంక్ పెట్టె తెరిచి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చిత్తు కాగితాల సంచుల్లో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు వీరిద్దరి వేలి ముద్రలు, సీసీ కెమెరా విజువల్స్ ఆధారాంగా వీరిద్దరే చోరీ చేసినట్లు గుర్తించారు. చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను తీసుకెళ్లి.. వారి ఇంటి దగ్గరలోని చెత్త కుప్పలోనే దాచి ఉంచారు. ఆ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు కృష్ణా జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది.. ఈచోరీ చేసింది గుంటూరు జిల్లా తెనాలికి చెందినవారిగా గుర్తించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అమృతవల్లి అలియాస్ తిరుపతమ్మ, శ్రీరామ కోటేశ్వరి అలియాస్ జ్యోతి, మోగలి అన్నమయ్యలు చెత్త ఏరుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి చోరీలు చేస్తున్నారు. వీరి గురించి ఆరా తీసిన పోలీసులు.. ఐలూరు శివారు ములకలపల్లిలంకలో తిరుగుతుండగా పట్టుకొని ప్రశ్నించడంతో చోరీ వ్యవహారం బయటపడింది. ఈ ముగ్గురు దగ్గర నుంచి వెండి పళ్లాలు, గ్లాసులు, చెంచాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో తిరుపతమ్మపై మూడు కేసులు, శ్రీరామ కోటేశ్వరిపై ఐదు కేసులున్నట్లు గుర్తించానారు పోలీసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.