ప్రపంచంలో అగ్రరాజ్యంగా చెలామణి అవుతోన్న అమెరికాలో చదువుకుని, అక్కడే ఉద్యోగం సంపాదించుకోవాలని యువత కలగంటుంది. ఆ దేశంలో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి. కానీ, ఈ వీసా పొందడం ఆషామాషీ కాదు. దీని కోసం పడిగాపులు కాయాల్సిందే. ప్రస్తుతం భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఉన్న అమెరికా కాన్సులేట్స్‌లో వీసా ప్రాసెసింగ్ సమయం భారీగా పెరిగింది. బీ1/బీ2 వీసాల కోసం నిరీక్షణ సమయం కోల్‌కతాలో 500 రోజులు ఉండగా.. తర్వాతి స్థానంలో చెన్నై 486 రోజులు, హైదరాబాద్ 435 రోజులు, దేశ రాజధాని ఢిల్లీ 432 రోజులుగా ఉంది. తక్కువలో తక్కువ ఆర్థిక రాజధాని ముంబయిలో 427 రోజులుగా ఉండటం గమనార్హం. వీసా ప్రక్రియలో భారీగా కొనసాగుతున్న జాప్యం దరఖాస్తుదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
తర్వితగతిన ప్రాసెసింగ్ పూర్తిచేసి.. దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ప్రయత్నిస్తున్నప్పటికీ నిరీక్షణ సమయం మాత్రం తగ్గడం లేదు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ ప్రకారం.. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల కోసం అంచనా వేసిన నిరీక్షణ.. పనిభారం, సిబ్బంది వ్యత్యాసాల ఆధారంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఈ క్రమంలో వెయిటింగ్ సమయం వారం వారం మారుతుందని పేర్కొంది.
బీ1 వీసా వ్యాపార సంబంధ కార్యకలాపాలు.. బీ2 వీసా పర్యాటకం, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను కలవడానికి, వైద్య చికిత్స, సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యేవారకి ఉద్దేశించింది. సాధారణంగా బీ1, బీ2 వీసాలు కలిసి జారీ చేస్తారు. ఈ వీసా లభించిన వ్యక్తులు.. అమెరికాలో ఉన్నప్పుడు వ్యాపార, వినోద కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఈ రెండు కేటగిరీల వీసాలు వీలు కల్పిస్తాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గతేడాది భారత్‌లోని యూఎస్ కాన్సులర్ బృందం రికార్డుస్థాయిలో 1.4 మిలియన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. దీంతో విజిటర్ వీసా అపాయింట్‌మెంట్ నిరీక్షణ సమయం 75% తగ్గించడంలో తోడ్పడింది. దీని వల్ల ఈ వీసాల కోసం ఎదురుచూస్తోన్న ధరఖాస్తుదారులకు కొంత ఉపశమం కలిగింది.
అమెరికా వీసాల కోసం అన్ని వర్గాలలో డిమాండ్ పెరిగింది. మునుపటి ఏడాదితో పోల్చితే దరఖాస్తుల సంఖ్య 60% పెరిగింది. విజిటింగ్ వీసా ఇంటర్వ్యూ మినహాయింపు కోరుకునే దరఖాస్తుదారులకు డిమాండ్ పెరుగుతోంది. ఢిల్లీలో ఈ కేటగిరీ వీసాలకు నిరీక్షణ టైం 14 రోజులు . కోల్‌కతాలో 13 రోజులుగా ఉంది. వీసా అపాయింట్‌మెంట్ లభ్యతను వచ్చే ఏడాది అదనంగా ఒక మిలియన్ స్లాట్‌లకు పెంచే ప్రణాళికలను కొద్ది రోజుల కిందట అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్ ప్రకటించారు. 2026లో ఎఫ్ఐఎఫ్ఏ ప్రపంచ కప్, 2028లో ఒలింపిక్స్‌తో సహా ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్‌లకు సిద్ధమవుతోన్న అమెరికా.. పెరుగుతున్న వీసా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న నివేదికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో వీసా అపాయింట్‌మెంట్ నిరీక్షణ సమయం పెరుగుదల చూస్తుంటే.. ట్రంప్ గేమ్ మొదలైందనే భావన వ్యక్తమవుతోంది. అమెరికాలో అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన గెలుపులో ఈ అంశం కీలక పాత్ర పోషించింది.