టాయిలెట్‌లో పది నిమిషాలకు మించి కూర్చుంటే అనారోగ్య సమస్యలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మొలల వ్యాధి ముప్పు పెరుగుతుందని, కటి కండరాలు బలహీనంగా మారుతాయని టెక్సాస్ యూనివర్సిటీ సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ లై క్సూ పేర్కొన్నారు. 5, 10 నిమిషాలకు మించి టాయిలెట్‌లో ఉండొద్దని న్యూయార్క్‌లోని స్టోని బ్రూక్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరా మన్జూర్ సూచించారు.టాయిలెట్ కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని, దీంతో పాయువు, దిగువ పురీషనాళం చుట్టూ ఉండే సిరలు, రక్తనాళాలు పెద్దవిగా మారి మొలలు ఏర్పడతాయని వివరించారు. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది దానిని టాయిలెట్‌లోకి తీసుకెళ్లి దానిని చూస్తూ నిమిషాలకు నిమిషాలు గడిపేస్తున్నారు. చాలామందికి ఇది అలవాటుగానూ మారింది. ఈ నేపథ్యంలో నిపుణులు ఈ హెచ్చరిక చేశారు.