చేపలు ఎంతో ఆరోగ్యకరమైనవి. చికెన్, మటన్‌తో పోలిస్తే చేపల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. చేపలను ఎన్ని తిన్నా కూడా మీలో కొవ్వు పేరుకుపోదు. బరువు పెరగరు.కాబట్టి చికెన్, మటన్ కు బదులు అప్పుడప్పుడు చేపలను అధికంగా తినేందుకు ప్రయత్నించండి. చికెన్ పులావ్, మటన్ పులావ్ తినే ఉంటారు. ఇంట్లోనే ఒకసారి చేపల పులావ్ ట్రై చేయండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని చేయడం కష్టం అనుకుంటారు గానీ చాలా సింపుల్ గా చేసేయొచ్చు.
ఫిష్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం - ఒకటిన్నర కప్పు
చేపలు - పావు కిలో
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
ఉల్లిపాయలు - రెండు
గరం మసాలా - అర స్పూను
పెరుగు - ఒక కప్పు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
నూనె - సరిపడినంత
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - రెండు
యాలకులు - రెండు
రాఠి మొగ్గ - ఒకటి
అనాస పువ్వు - ఒకటి
చేపల పులావ్ రెసిపీ
1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి గిన్నెలో వేయాలి.
2. అందులోనే ఉప్పు, కారం, పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పెరుగు వేసి బాగా కలపాలి. అరగంట పాటు పక్కన పెట్టేయాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనెలో చేప ముక్కలను లేదా చేపలను గోధుమ రంగులోకి మారే వరకు వేయించుకోవాలి.
5. అరవై శాతం చేపలు ఉడికితే చాలు. వాటిని తీసుకొచ్చి పక్కన పెట్టాలి.
6. మెల్లగా చేపల మధ్య ఉన్న బోన్స్ ను వదిలేసి పైన ఉన్న చేప మాంసాన్ని ముక్కలు ముక్కలుగా తీసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
8. ఆ నూనెలో లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, మరాఠి మొగ్గు వేసి వేయించాలి.
9. ఉల్లిపాయ తరుగును, పచ్చిమిర్చి తరుగును వేసి వేయించాలి.
10. కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి.
11. గరం మసాలా, పసుపు, కారం వేసి బాగా కలపాలి.
12. ఈ మిశ్రమంలో ముందుగా ముక్కలుగా తీసి పెట్టుకున్నా చేపలను కూడా వేయాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.13. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి పులిహార లాగా కలుపుకోవాలి.
14.పైన మూత పెట్టి చిన్న మంట మీద ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంచాలి. అంతే టేస్టీ చేపల పులావ్ రెడీ అయినట్టే.
15. దీన్ని తింటుంటే నోరూరిపోతుంది. చికెన్ పులావ్, మటన్ పులావ్ తో పోలిస్తే చేపల పులావ్ చాలా త్వరగా సులువుగా అయిపోతుంది.
చికెన్, మటన్ ముక్కలు గట్టిగా ఉంటాయి. కాబట్టి మీరు ఎలా వేయించినా అవి ముక్కలుగా అవ్వవు. కానీ చేపను బోన్స్ లేకుండా విడదీసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కొంతమంది వీటిని ఆవిరి మీద ఉడికిస్తే మరి కొందరు నూనెలో వేయిస్తారు. అలా వేయించాక చేపల ముక్కలను విడివిడిగా తీసి పెట్టుకోవాలి. ఎముకలను తీసి పడేయాలి. అలా తీసేసాక చికెన్ పులావ్ చేసుకున్నట్టే దీన్ని వండుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ముల్లులను తీసి పెడతాం, కాబట్టి పిల్లలు ఇష్టంగా తినే అవకాశం ఉంది.