బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను తీరం దాటినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం ఇంకా వీడలేదు. పలుచోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. ఫెంగల్ తుపాను కారణంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. సోమవారం కూడా చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లావాసులు కూడా సోమవారం స్కూళ్లకు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల నిర్ణయం మేరకు ఆ విషయం ఆధారపడి ఉంది. మరోవైపు తుపాను కారణంగా చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మత్స్యకారులను సోమవారం కూడా చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, మిట్టూరు, పుత్తూరు, పెనుమూరులో భారీ వర్షం కురిసింది. కలవకుంట ఎన్టీఆర్ జలాశయంలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరటంతో నీటిని దిగువకు వదులుతున్నారు.
ఫెంగల్ తుపాను కారణంగా కురిసిన వర్షాలతో రైతులకు నష్టం కలుగుతోంది. చిత్తూరు జిల్లాలోని మామిడి, టమాటా, పూలు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. వరి కోతకు వచ్చిన సమయంలో వర్షాలు రావటంతో దిగుబడిపై ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులకు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. తెగుళ్ల రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే విద్యుత్ సమస్యలు తలెత్తకుండా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా ఏ ప్రాంతంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు.