రైతన్నలు మరోసారి కదం తొక్కారు. వివిధ రైతు సంఘాల పిలుపు మేరకు.. వివిధ రాష్ట్రాలకు చెందిన అన్నదాతలు.. దేశ రాజధాని ఢిల్లీ వైపు కదిలారు. తమ డిమాండ్లను సాధించుకునేందుకు పార్లమెంటును ముట్టడించాలని నిర్ణయించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఢిల్లీలోకి వచ్చే రైతులను అడ్డుకునేందుకు మరోసారి ఢిల్లీ - నోయిడా సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతోపాటు మరిన్ని డిమాండ్లపై ఏళ్లుగా అన్నదాతలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో మరోసారి కేంద్రం వైఖరికి నిరసనగా పోరుబాట పట్టారు. డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్ ముట్టడికి రైతు సంఘాల నేతలు పిలుపునివ్వగా.. ఈ ఉదయం ఉత్తర్‌ప్రదేశ్ రైతులు నోయిడా నుంచి ఢిల్లీకి మార్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రైతుల ఆందోళనతో ఢిల్లీ నోయిడా సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
భారతీయ కిసాన్ పరిషత్-బీకేపీ ఆధ్వర్యంలో వివిధ సంఘాలన్నీ కలిసి 20 జిల్లాలకు చెందిన రైతులు.. ఆ ఢిల్లీ ఛలో ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భారీగా వాహనాల లైన్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి.. భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. గ్రేటర్ నోయిడాలోని చిల్లా బోర్డర్ వద్ద.. 10 లేన్లలో వాహనాలు అలాగే నిలిచిపోయాయి. ఇక ఆదివారం కూడా నోయిడా పోలీసులు.. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
తమ డిమాండ్లు నెరవేర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు కేంద్ర ప్రభుత్వా్న్ని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల ప్రకారం పరిహారం, ప్రయోజనాలకు హామీ ఇవ్వగా వాటిని అమలు చేయాలని పేర్కొంటున్నారు. పంజాప్ హర్యానాల్లో శంభు, ఖనౌరీ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
రైతులు ప్రధానంగా 5 కీలక డిమాండ్లు చేస్తున్నారు. పాత భూసేకరణ చట్టం ప్రకారం 10 శాతం ప్లాట్లు, 64.7 శాతం పరిహారం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ ధరకు 4 రెట్లు పరిహారం.. 2014 జనవరి 1వ తేదీ తర్వాత సేకరించిన భూమిలో 20 శాతం ప్లాట్లు, ఉపాధి, పునరావాస ప్రయోజనాలు కల్పించాలని పేర్కొంటున్నారు. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని రైతులు ప్రధానంగా కోరుతున్నారు. రుణ మాఫీ చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని చెబుతున్నారు. రైతులపై పెట్టిన పోలీస్ కేసులు ఎత్తివేయాలని.. 2021 లఖింపూర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలని.. ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.