పుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని.. వంద మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత విషాదకర ఈ ఘటన పశ్చిమాఫ్రికా దేశం గినియాలో చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటన 100 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల సంఖ్యలో గాయపడ్డారు. రెండు జట్ల అభిమానుల మధ్య మొదలైన చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారింది. మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఓ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు దిగారు.
ఈ సందర్భంగా రెచ్చిపోయిన అల్లరి మూకలు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించాయి. ఈ హింసాత్మక ఘర్షణల్లో వంద మందికి చనిపోగా.. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆసుపత్రిలో పదుల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. డజన్ల మంది చనిపోయారని స్థానిక వైద్యుడు ఒకరు తెలిపారు.
కాగా, గతంలోనూ అభిమానులు రెండుగా చీలిపోయిన ఘర్షణ పడి.. దాడులు చేసుకున్న ఘటనలు పలుచోట్ల జరిగాయి. గతేడాది అక్టోబరులో వన్డె ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్, అఫ్గన్ జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాలో జరిగిన మ్యాచ్ మధ్యలో అభిమానులు ఘర్షణ పడ్డారు. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.