ఢిల్లీలో బుధవారం జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. నిన్న ఉదయం ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల హత్యలతో దేశ రాజధాని ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. భార్యా,భర్త, కుమార్తె ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కేసును చేధించారు. ఇక ఇంత ఘోరానికి పాల్పడిన వ్యక్తి ఎవరో తెలియడంతో పోలీసులతోపాటు అందరూ షాక్‌కు గురయ్యారు. కేసుకు సంబంధించిన వివవరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు.
దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్‌లో దంపతులు, వారి 23 ఏళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసిన కేసులో.. వారి కుమారుడే హంతకుడిగా తేల్చారు. కొడుకు ప్రవర్తన అసహజంగా అనిపించడంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. కుటుంబ సభ్యుల హత్య సమయంలో ఉదయం వాక్‌కు వెళ్లిన్నట్లు చెబుతున్న అతడు.. తల్లిదండ్రులు తనను పదే పదే అవమానించారని, ఆస్తి మొత్తాన్ని సోదరికి రాసిచ్చే ప్రయత్నం చేస్తున్నారనే కోపంతో వారిని హత్య చేసినట్లు వెల్లడించారు.
ఈ విషయం తెలుసుకున్న అతను నిద్రలోనే తన కుటుంబాన్ని కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా కుటుంబాన్ని హత్యకు ప్లాన్ చేస్తున్నాడని, తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసినట్లువెల్లడించారు.
కాగా రాజేష్ కుమార్ (51), అతని భార్య కోమల్ (46), వారి 23 ఏళ్ల కుమార్తె కవిత మృతదేహాలు నెబ్ సరాయ్‌లోని వారి ఇంట్లో బుధవారం ఉదయం లభ్యమయ్యాయి. రాజేష్, కోమల్ మరో కుమారుడు, అర్జున్(20), అతను ఉదయం 5.30 గంటలకు తన మార్నింగ్ వాక్ కోసం బయలుదేరానని, తిరిగి వచ్చేసరికి మృతదేహాలు కనిపించాయని పేర్కొన్నాడు. కొడుకు హత్యల గురించి పోలీసులను అప్రమత్తం చేయడమే కాకుండా తన మామకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఇంట్లోకి బయట నుంచి ఎవరూ రాలేదని గుర్తించారు. అనుమానం వచ్చిన పోలీసులు అర్జున్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడని జాయింట్ సీపీ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు.