ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థుల కోసం ఎల్ఐసీ కొత్త పథకం.. స్కాలర్‌షిప్‌కు అర్హులెవరు..

business |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 10:15 PM

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సరికొత్త స్కాలర్‌షిప్ పథకం తీసుకొచ్చింది. గోల్డెన్‌జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం- 2024 పేరిట ఈ పథకం తీసుకురాగా.. దీని కింద ప్రతిభ ఉన్న విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందిస్తుంది. ఎల్ఐసీ ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. దీంట్లోనే.. అర్హత, అర్హులు.. దరఖాస్తు తేదీలు వంటి పూర్తి వివరాల్ని అందుబాటులో ఉంచింది.


2021-22, 2022-23 అదే విధంగా 2023-24 విద్యా సంవత్సరాల్లో పదవ తరగతి లేదా ఇంటర్మీడియెట్ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్న వాళ్లు ఈ స్కాలర్‌ షిప్ పొందేందుకు అర్హులు. వీరు గుర్తింపు పొందిన ఏదైనా విద్యా సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులైనా సాధించి ఉండాలి. లేదా దీనికి సమానమైన CGPA గ్రేడ్ కలిగి ఉండాలి. 2024-25లో ఉన్నత విద్య చదవాలని అనుకొనే బాల బాలికలకు జనరల్ స్కాలర్‌షిప్స్ అందించనుంది.


మెడిసిన్, గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్, ఏదైనా విభాగంలో డిప్లొమా చేయాలనుకుంటున్నా.. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో వొకేషన్ కోర్సులు చేయాలన్నా.. లేదా ఐటీఐ చదవాలన్నా ఈ నగదు భరోసా కల్పిస్తారని చెప్పొచ్చు. ఇందులో స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థినులకు రెండు సంవత్సరాల పాటు స్కాలర్ షిప్స్ అందిస్తారు.


10వ తరగతి పూర్తి చేసుకొని.. ఇంటర్మీడియెట్ లేదా 10+2 లేదా ఇతర ఏదైనా విభాగంలో డిప్లొమా కోర్స్ పూర్తి చేయాలనుకున్న వారు ఈ స్పెషల్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్.. www.licindia.in ద్వారా ఆన్‌లైన్‌లోనే ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసీ స్కాలర్ షిప్ డెడ్‌లైన్ 2024, డిసెంబర్ 22తో ముగియనుంది. ఇక దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 8 (ఆదివారం) నుంచే ప్రారంభం కానుంది. ఇక కుటుంబ అర్హత సహా స్కాలర్ షిప్ ఎంత మొత్తం వరకు వస్తుంది.. ఇలా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఎల్ఐసీ అఫీషియల్ వెబ్‌సైట్ సందర్శించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com