పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడితే చూడాలని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలు వాళ్ల లక్ష్యాలను చేరుకునే వరకు ఎంత కష్టమైనా పడుతూ వారికి అండగా నిలుస్తారు. ఇలాగే భావించిన ఓ తండ్రి తన కూతురును కష్టపడి చదివించాడు. ఆమె కూడా తండ్రి కలలకు తగ్గట్లుగానే బాగా చదివి మంచి ఉద్యోగం సంపాధించింది. ఇక కుటుంబంతో హాయిగా ఉండొచ్చని భావించి.. తొలిరోజే ఆఫీసుకు బయలు దేరింది. ఎంతో సంతోషంగా తండ్రికి బై చెప్పి మరీ వెళ్లింది. అలా వెళ్లిన కూతురు రోడ్డు ప్రమాదంలో మరణించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
ముంబయిలో సోమవారం రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. 42 మంది గాయపడ్డారు. అయితే మృతుల్లో ఒకరైన 20 ఏళ్ల అఫ్రీన్ షా గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇటీవలే చదువు పూర్తి చేసుకుని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సాధించిన ఈమెకు.. సోమవారమే ఉద్యోగంలో తొలిరోజు. సంతోషం, భయంతో మొదటి రోజు ఆఫీసుకు వెళ్తున్న ఆమెకు తండ్రి అబ్దుల్ సలీమ్ షా చాలా ధైర్యం చెప్పాడు. ఆఫీసుకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించాడు.
అలా ఉద్యోగానికి వెళ్లిన కూతురు సాయంత్రం ఆఫీసు అయిపోగానే తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత కుర్లా రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి తన ఇంటివైపు ఆటోలు రావడం లేదని రాత్రి 9.09 గంటలకు మరోసారి ఫోన్ చేసి చెప్పినట్లు సలీమ్ షా చెప్పారు. అయితే హైవే వైపు నడిచి ఆటో కోసం ప్రయత్నిస్తే దొరుకుతాయని తండ్రి సూచించగా ఆమె అటువైపు వెళ్లింది. అక్కడే రోడ్డు ప్రమాదానికి గురైంది. చనిపోయింది. ఆ తర్వాత పోలీసులు రావడం, ఆస్పత్రికి తరలించడం.. మృతి చెందిన వారి కుటుంబాలకు సమాచారం అందించడం వరుసగా జరిగాయి.
అయితే రాత్రి 9.54 నిమిషాలకు అఫ్రీన్ నుంచి తండ్రికి మళ్లీ ఫోన్ రావడంతో.. కూతురు వచ్చిందనుకున్న ఆయనకు గుండెలు పగిలే విషయం తెలిసింది. తన కూతురు బస్సు ప్రమాదంలో మరణించిందని.. ప్రస్తుతం ఆమె మృతదేహం భాభా ఆస్పత్రిలో ఉన్నట్లు వైద్యులు వవరించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే సలీమ్ షా ఆస్పత్రికి చేరుకుని కూతురు మృతదేహాన్ని చూశాడు. ఉద్యోగం చేసి ఉన్నత స్థాయికి చేరుకుంటుందని కలలు కన్న కూతురు.. ఉద్యోగంలో చేరిన తొలిరోజే కానరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ గుండెలవిసేలా రోదించాడు.
ఆఫీసుకు వెళ్తానంటూ చెప్పిన నా కూతురు ఇంకెప్పటికీ మా ఇంటికి తిరిగిరాదంటూ సలీమ్ షా ఏడవడం చూసిన స్థానికులు అంతా కంటతడి పెట్టారు. కూతురు చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్లు సరిగ్గా లేవని, ఎన్నో ఏళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆ సమస్యలు అన్ని తీర్చి ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా చేయాలని.. ముఖ్యంగా తమలాంటి తల్లిదండ్రులకు కడుపుకోత మిగలకుండా చేయాలని కోరారు.