ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్ కనిపిస్తుంటుంది. చిన్నా, పెద్దా, ముసలి తేడా లేకుండా ప్రతీ ఒక్కరు రోజులో గంటల తరబడి ఫోన్‌లోనే మునిగిపోవడం చూస్తూనే ఉంటాం. చూడటం కాదు.. మనం కూడా ఏదో ఒక అవసరం గురించో లేక టైం పాస్ కోసమో, గేమ్స్ ఆడటం, రీల్స్ చూడటం, సోషల్ మీడియా చూస్తూ.. పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియకుండా కాలం గడిపేస్తున్నాం. ఇక క్రమంగా సెల్‌ఫోన్‌లకు బానిసలు అవుతున్నాం అని తెలిసినా అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం. అయితే ఓ సంస్థ నిర్వహించిన పోటీలో పాల్గొన్న ఓ యువతి.. అందులో విజేతగా నిలిచి ఏకంగా రూ.1.16 లక్షలు గెలుచుకుంది. చైనాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారింది.
చైనాలో ఒక మహిళ 8 గంటల పాటు మొబైల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉండి.. ఛాలెంజ్‌లో విజేతగా నిలిచి 10 వేల యువాన్లు అంటే మన భారత కరెన్సీలో రూ.1.16 లక్షలు గెలుచుకుంది. నవంబర్ 29వ తేదీన చాంగ్ కింగ్ మున్సిపాలిటీలోని ఓ షాపింగ్ సెంటర్‌లో జరిగింది. ఈ పోటీలో భాగంగా 100 మంది అప్లై చేసుకోగా.. వారి నుంచి 10 మందికి మాత్రమే ఛాలెంజ్ నిర్వహించారు. అయితే ఈ ఛాలెంజ్ ఏంటంటే.. ఇందులో పాల్గొనే ఒక్కొక్కరికీ ఒక్కో బెడ్‌ను కేటాయిస్తారు. వారు తమకు ఇచ్చిన బెడ్‌పై 8 గంటల పాటు గడపాల్సి ఉంటుంది. ఇక ఈ పోటీలో పాల్గొనే వారి సెల్‌ఫోన్లను ముందుగానే తీసుకుంటారు.
ఈ పోటీ జరుగుతున్న 8 గంటల పాటు సెల్‌ఫోన్ గానీ.. ఐప్యాడ్‌లు గానీ.. ల్యాప్‌టాప్‌లు సహా మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పోటీదారులు ఉపయోగించడానికి వీలు లేదు. ఇక ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే పోటీదారులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసుకునే సౌకర్యం మాత్రమే కల్పించారు. అయితే ఇందుకోసం స్మార్ట్ ఫోన్ కాకుండా పాత మొబైల్ ఫోన్లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ పోటీ జరుగుతున్న 8 గంటల పాటు పోటీదారులు బెడ్‌పైనే ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో వారు టాయిలెట్‌కు వెళ్లొచ్చు. డ్రింక్స్, భోజనం బెడ్ వద్దకే తీసుకువచ్చి అందించారు. ఇక పోటీదారులు ఆ బెడ్‌పై నిద్ర పోకూడదు.
అంతేకాకుండా సెల్‌ఫోన్ లేదని వారిలో ఎలాంటి ఆందోళన ఉండకూడదు. దానికోసం వారి నిద్ర, ఆందోళన స్థాయిలను పర్యవేక్షించడానికి వారి చేతికి పట్టీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ పోటీలో పాల్గొన్న చాలా మంది పోటీదారులు.. పుస్తకాలు చదవడం, కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం లాంటివి చేసి.. ఆ 8 గంటలను గడిపారు. అయితే వారు చేసిన పనులు, ఆ 8 గంటల్లో వారి ప్రవర్తనను బట్టి వారికి స్కోరును కేటాయించారు. చివరికి డాంగ్ అనే మహిళ 100కు 88.99 స్కోర్‌ను సాధించి ఈ ఛాలెంజ్ ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ఆమెను విన్నర్‌గా ప్రకటించి.. రూ.1.16 లక్షల నగదు బహుమతిని అందించారు.