పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు.. ఎదురింటి పిన్ని గారి కాసులపేరు చూడు.. అంటూ ఆమని తన భర్త మీద రాగాలు తీస్తుంటే.. మనందరికీ భలే సరదాగా ఉండేది. అసూయతో కూడిన ఆమని అమాకత్వంలో మనల్ని మనం చూసుకునేవాళ్లం. నిజానికి ప్రతి మనిషిలోనూ అసూయ అనేది ఎంతో కొంత ఉంటుంది. కానీ దానికీ ఓ పరిమితి ఉంటుంది. ఎదురింట్లో ఉండే చిరంజీవికి మంచి ర్యాంక్ వచ్చిందంటే.. అసూయతో రగిలిపోవటం కాదు.. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అంతకుమించి సాధించేలా కృష్టి చేయాలి..అంతే కానీ.. ఇలా కడుపుమంటతో, కన్న వారి మీద కోపంతో కడుపులోకి ఏది పడితే అది తోస్తే ఎలా..?
అసలు వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ అనూహ్య ఘటన జరిగింది. నరసరావుపేటకు భవానీ ప్రసాద్‌కు బైక్ అంటే మోజు. దీనికి తోడు తన పక్కింట్లో ఉండే కుర్రోడు కొత్తగా బైక్ కొన్నాడు. దీంతో తనకు కూడా అలాంటి బైక్ కావాలని భవానీ ప్రసాద్ ఇంట్లో వారిపై ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. అయితే ప్రస్తుతం డబ్బులు లేవంటూ భవానీ ప్రసాద్ కుటుంబసభ్యులు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇవేవీ పట్టించుకోని భవానీ ప్రసాద్ వారితో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగింది. దీంతో మనస్థాపం చెందిన భవానీ ప్రసాద్ ఇంట్లో వారి మీద కోపంతో.. నాలుగు తాళం చెవులను మింగేశాడు. దీంతో కడుపునొప్పి మొదలైంది. బుధవారం సాయంత్రం కడుపునొప్పి ఎక్కువ కావటంతో కుటుంబసభ్యులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.
భవానీ ప్రసాద్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన గుంటూరు ఆస్పత్రి వైద్యులు.. స్కానింగ్ తీయగా అసలు విషయం బయటపడింది. కడుపులో తాళం చెవులు ఉన్న విషయం తెలిసింది. ఆ తర్వాత ఎందుకు మింగావంటూ వైద్యులు ప్రశ్నించడంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. పక్కింటోళ్లు బైక్ కొన్నారని.. తనకు కొనివ్వమంటే ఇంట్లో వాళ్లు తీసివ్వటం లేదంటూ భవానీ ప్రసాద్ చెప్పాడు. దీంతో వైద్యులు షాక్ తిన్నారు. బైక్ కోసం ఇంత పని చేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు. అయితే తాళం చెవులు పొట్ట పైభాగంలోనే ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆపరేషన్ అవసరం లేకుండా ల్యాప్రోస్కోపి ద్వారా నాలుగు తాళం చెవులను బయటకు తీశారు.