అవయవదానం చేయాలన్నా, శరీరదానం చేయాలన్నా చాలా మంది ముందుకురారు. సంస్కృతి, సంప్రదాయం అంటూ చనిపోయిన వారి అవయవాలను ఇతరులకు ఇవ్వకుండా అంత్యక్రియలు చేయాలనుకుంటారు. అలాగే మృతదేహాలను మెడికల్ కాలేజీలకు ఇచ్చి టెస్టులు చేసుకోవడానికి కూడా ఒప్పుకోరు. ఇప్పుడిప్పుడే ఈ పద్ధతి మారుతోంది. సమాజంపై అవగాహన ఉండి బాగా చదువుకున్న వాళ్లంతా అవయవదానంతో పాటు శరీరదానం చేస్తున్నారు. శరీరదానం చేయడంలో ఎక్కువగా వృద్ధులు ఉంటారు. కానీ తొలిసారిగా ఓ 2 రోజుల పాప శరీరదాతగా మారింది. ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హరిద్వార్‌కు చెందిన ఓ మహిళ డెలివరీ కోసం డెహ్రాడూన్‌లోని డూన్ మెడికల్ కాలేజీ అండ్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. సోమవారం రోజు ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే ఏడ్వాల్సిన పాప ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. దీంతో టెన్షన్ పడిన వైద్యులు వెంటనే శిశువుకు అనేక రకాల పరీక్షలు చేశారు. చిన్నారి మెదడకు ఆక్సిజన్ అందడం లేదని తెలుసుకున్నారు. ఫలితంగా హైపోక్సియా ఏర్పడింది. అది గుండె సంబంధిత సమస్యగా మారి 2.5 రోజుల వ్యవధిలో చనిపోయింది. పాప మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
అనంతరం శిశువు మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు తీసుకు వెళ్లకుండా మెడికల్ కాలేజీకి ఇస్తామని తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. ఈ విషయం విన్న వైద్యులు వారి మంచి మనసు చూసి మురిసిపోయారు. ఆమె మృతదేహం తమ పరిశోధనలకు ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే శరీరదాతగా మారిన బాలిక.. దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డుకెక్కింది. దేశంలో ఇప్పటి వరకు ఇంత చిన్న వయసు శరీరదాత లేరని వైద్యులు చెప్పారు. ఇప్పటి వరకు 7 రోజుల వయసు ఉన్న శరీరదాత రికార్డులో ఉండగా.. దాన్ని బ్రేక్ చేస్తూ బాలిక నిలిచింది.
2016లో శరీరదాన కార్యక్రమాన్ని తమ ఆసుపత్రిలో ప్రారంభించామని.. అప్పటి నుంచి డూన్ హాస్పిటల్ ఇప్పటి వరకు మొత్తం 33 శరీరాలను విరాళంగా అందుకున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇందులో ఎక్కువగా వృద్ధులే ఉన్నారని కూడా వివరించారు. అలాగే బాలికను పరిశోధనల కోసం ఇచ్చిన తల్లిదండ్రులకు వైద్యులు మర్రిచెట్టును బహుమతిగా అందించారు. ఆ చెట్టు ఎక్కువ కాలం బతుకుతుందని.. అది పాప త్యాగాన్ని గుర్తు చేస్తుందని వైద్యులు చెప్పుకొచ్చారు.
అలాగే పాప మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఆమెకు పేరు పెట్టాలి కాబట్టి.. తల్లిదండ్రులను అడిగి సరస్వతి అని పేరు కూడా పెట్టారు. అలాగే బుజ్జాయిని ఆస్పత్రిలోని మ్యూజియంలో పెడతామని చెప్పారు. అది చూసి అయినా శరీరాలను విరాళంగా ఇచ్చే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. చిన్నారి మృతదేహం అవగాహనను వ్యాప్తి చేయడంలో బాగా సాయపడుతుందని వైద్యులు వెల్లడించారు. సమాజ శ్రేయస్సు కోరే ప్రతీ ఒక్కరూ శరీర దానం చేయాలని.. దాని వల్ల వైద్య పరిశోధనలు పెరిగి అనేక చికిత్సలకు మార్గం దొరుకుతుందన్నారు.