సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీలో చేరుతున్నారని, అధినాయకత్వం నిర్ణయమే మా అందరి నిర్ణయం కూడా అని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నాని రాకను వ్యతిరేకిస్తూ కేడర్ కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమేనని, అయినప్పటికీ పార్టీ నిర్ణయానికే తామూ, కేడర్ కట్టుబడి ఉంటామని మీడియాకు తెలిపారు. ఈ విషయంలో అపోహలు, వివాదాలకు తావేలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన తామంతా క్రమశిక్షణగల సైనికులుగానే వ్యవహరిస్తామని చంటి ప్రకటించారు. ఇదిలా ఉండగా టీడీపీ అధినాయకత్వం కూడా నాని చేరికను ఖరారు చేసిన వైనాన్ని ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకొచ్చింది. రాజకీయంగా అంతా ఆలోచించే పార్టీ నిర్ణయాలు ఉంటాయనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఆళ్ల నాని చేరిక సందర్భంగా మీరు కూడా హాజరుకావాలని ఎమ్మెల్యే చంటికి అధినాయకత్వం ఆహ్వానించింది. ఎలాంటి బేషిజం లేకుండా తాను కూడా హాజరవుతున్నట్టు చంటి బదులిచ్చారు.