శ్రీకాకుళం జిల్లాలో ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలై మరణించిన వారే అధికంగా ఉంటున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు నివేదికలో వెల్లడైంది. ప్రతిరోజూ హెల్మెట్ వాడటంతో తల వెంట్రుకలు రాలిపోతున్నాయని, తల వేడికి గురౌతుందని ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే మరికొందరు ఫోన్‌లో మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. నేటి యువత వేగానికిచ్చిన విలువ ప్రాణాలకు, హెల్మెట్ ధరించేందుకు ఇవ్వడం లేదు. దీనిపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా చాలామంది ద్విచక్రవాహనదారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.