ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ కంపెనీకి రూ.226 కోట్ల ఆర్డర్.. ఒక్కరోజే 10 శాతం పెరిగిన స్టాక్.. కొత్త టార్గెట్ ప్రైస్ ఇదే

business |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 09:39 PM

స్మాల్ క్యాప్ కేటగిరికి ఏరోస్పేస్ సెక్టార్ కంపెనీ ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీకి కొత్త ఆర్డర్ వచ్చినట్లు ప్రకటించిన క్రమంలో శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్స్‌లో 10 శాతానికి పైగా పెరిగింది. క్లీన్ ఎనర్జీ, ఏరో స్పేస్ సెగ్మెంట్స్ ద్వారా రూ. 226 కోట్ల ఆర్డర్స్ వచ్చినట్లు తెలిపిన క్రమంలో ఈ షేర్‌లో భారీ ర్యాలీ చేపట్టింది. మరోకవైపు ఈ కంపెనీ షేరు గత వారంలో 5.5 శాతం మేర లాభాలు ఇచ్చింది.


కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. క్లీన్ ఎనర్జీ విభాగంలో వివిధ ఉత్పత్తులకు సంబంధించి బ్లూమ్ ఎనర్జీ కంపెనీ నుంచి రూ. 191 కోట్లు విలువైన ఆర్డర్స్ వచ్చాయి. వీటితో పాటు ఏరో స్పేస్ విభాగంలో రాఫెల్, ఐఎంఐ సిస్టమ్స్, ఐఏఐ సిస్టమ్స్ వంటి సంస్థల నుంచి రూ. 35 కోట్ల ఆర్డర్స్ పొందింది. ఈ ఆర్డర్స్ ఒక సంవత్సరంలో అమలు చేయాల్సి ఉంటుంది. కంపెనీ షేర్ అవుట్ లుక్ చూస్తే చివరి ట్రేడింగ్‌లో షేరు ధర ఒక దశలో దాదాపు 10 శాతం మేర పెరిగింది. ఇంట్రాడే హై స్థాయి రూ. 1777 స్థాయిని తాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి 5.69 శాతం మేర లాభంతో రూ. 1720 వద్ద స్థిరపడింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 2345 వద్ద ఉండగా.. కనిష్ఠ ధర రూ. 1495.40 వద్ద ఉంది. ఈ స్టాక్ కొనుగోలు చేయాలని ప్రముఖ బ్రోకరేజీ మోతీలాల్ ఓస్వాల్ సూచించింది. కొత్త టార్గెట్ ప్రైస్ రూ.2100గా సూచించింది.


కంపెనీ ప్రొఫైల్ పరిశీలిస్తే.. ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ కోసం మిషన్ క్రిటికల్ ప్రెసిషన్ కంపోనెంట్స్ తయారు చేస్తుంది. ఈ కంపెనీని 1970వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. గత వారం రోజుల్లో ఈ స్టాక్ దాదాపు 6 శాతం వరకు లాభాలు అందించింది. అయితే, గత నెల రోజుల్లో 1 శాతం నష్టాన్ని, గత ఆరు నెలల్లో 9 శాతం నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్లలో లిస్టింగ్ అయినప్పటి నుంచి అంటే గత మూడేళ్ల కాలంలో ఈ స్టాక్ 69 శాతం లాభాలు అందించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com