ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 67,260 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,708 మంది తలనీలాలు సమర్పించారు.తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.23 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.కాగా- వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ 10 రోజుల్లో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని టీటీడీ అంచనా వేస్తోంది.
ఒకవంక- వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు విస్తృతంగా కొనసాగుతుండగా.. మరోవంక తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మంచుతెరలు ఆనంద నిలయాన్ని కప్పివేశాయి. సప్తగిరులు మంచు దుప్పటిని కప్పుకొన్నాయి.వర్షపు తుంపర, లేత చలి, చుట్టూ అలముకున్న మంచుతెరలు, మంద్రంగా వినిపించే నారాయణుడి మంత్రోచ్ఛారణలతో అత్యంత మనోహరంగా కనిపించింది తిరుమల. శిలాతోరణం, పాపనాశనం, జాపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్లే మార్గాలన్నీ కూడా మరింత రమణీయంగా దర్శనం ఇచ్చాయి.