మిడ్ క్యాప్ కేటగిరి డిఫెన్స్ సెక్టార్ కంపెనీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (Cochin Shipyard Ltd) కీలక ప్రకటన చేసింది. తమకు కొత్త ఆర్డర్ లభించినట్లు ప్రకటించిన క్రమంలో ఈ షేరు ధర శుక్రవారంతో ముగిసిన స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్‌లో 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ కొట్టింది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూప్ నుంచి భారీ ఆర్డర్ వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్రమంలో ఈ షేరు ధరలో భారీ ర్యాలీ కనిపించింది. ఈ స్టాక్ కొనుగోలు చేసేందుకు మదుపరులు ఎగబడ్డారు. మరోవైపు ఈ షేరు గత ఏడాదిలో 127 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్ గా నిలిచింది.
కొచ్చిన్ షిప్ యార్డ్ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (పీఎస్యూ) కంపెనీ.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అనుబంధ సంస్థ ఓషన్ స్పార్కిల్ లిమిటెడ్ నుంచి ఎనిమిది 70T బొల్లార్డ్ పుల్ ఏఎస్డీ టగ్‌లు అందించేందుకు కొచ్చిన్ షిప్ యార్డ్ అనుబంధ సంస్థ ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.450 కోట్లుగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే మూడు 70T బొల్లార్డ్ పుల్ ఏఎస్డీ టగ్‌ల ఆర్డర్ ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్‌కి ఇచ్చింది. ప్రస్తుతం అవి కన్స్ట్రక్షన్‌లో ఉన్నాయి. మరోవైపు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ షేరుకి బై రేటింగ్ ఇచ్చింది ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆంటిక్యూ రీసెర్చ్. దీనిలో భాగంగా కొత్త టార్గెట్ రూ. 1627 అందిస్తున్నట్లు బ్రోకరేజ్ సూచించింది.
స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్ (శుక్రవారం) రోజున కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ షేరు 5 శాతానికిపైగా లాభపడి అప్పర్ సర్క్యూట్ రూ. 1539.05 తాకింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 2979.45 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 611.28 వద్ద ఉంది. గత వారంలో ఈ షేరు 2 శాతం నష్టపోగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 2 శాతం పడిపోయింది. గత ఆరు నెలల్లో 32 శాతం నష్టపోయింది. ఇక గత ఏడాది కాలంలో 127 శాతం లాభపడింది. ఏడాది క్రితం ఇందులో రూ.1 లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసిన వారికి రూ.2.27 లక్షలు అందించింది. గత ఐదేళ్లలో 673 శాతం లాభాన్ని అందించింది. లక్ష పెట్టిన వారికి రూ.7.73 లక్షలు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 40,490 కోట్లుగా ఉంది.
దేశంలో నౌకలు తయారు చేసే అతిపెద్ద కంపెనీగా కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది. ఈ కంపెనీ ఇండియన్ నేవీ కోసం యుద్ధ నౌకలను తయారు చేస్తుంటుంది. డబుల్ హల్డ్ ఆయిల్ ట్యాంకర్స్ తయారు చేస్తోంది. ఈ కంపెనీని ఏప్రిల్ 29, 1972 సంవత్సరంలో ప్రారంభించారు.