దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఈ 2024లో చాలా కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. అందులో చాలా ఐపీఓలు ఇన్వెస్టర్లకు లిస్టింగ్ గెయిన్స్ అందించాయి. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ చివరి వరకు చిన్నా, పెద్దా ఐపీఓలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఓల ద్వారా కంపెనీలు సమీకరించిన మొత్తం రూ.1.62 లక్షల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. అలాగే క్యాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్, రైట్స్ ఇష్యూలు అదనమని చెప్పాలి. ఇవన్నీ కలుపితే ఈ ఏడాది మొత్తం రూ.3 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. ఇదే తీరు 2025లోనూ కొనసాగనుంది. పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూకు వచ్చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.
2024 ఏడాదిలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, స్విగ్గీ, ఓలా ఎలక్ట్రిక్ వంటి మొత్తం 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ రూ.27 వేల కోట్లకుపైగా సమీకరించి అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ రూ.20 వేల కోట్లను దాటేసి రికార్డ్ కొట్టింది. ఇక ఈ 2025లో ఈ రికార్డ్ అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2025లో వచ్చే ఐపీఓలు ఇవే..
2025లో దిగ్గజ కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. అందులో దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఉంది. ఇది 15 బిలియన్ డాలర్లు సమీకరించనుందట. ఇక వాల్‌మార్ట్‌కు చెందిన ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా ఐపీఓకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్‌కు తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే మార్కెట్‌లో లిస్టయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హీరో మోటో కార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మరణప్పురం ఫైనాన్స్, టాటా మోటార్స్, ముత్తూట్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ వంటి దిగ్గజ సంస్థల అనుబంధ కంపెనీలు ఈ 2025లో ఐపీఓలకు వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ 2025లో రిలయన్స్ జియో అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే స్థిర వృద్ధి, రెవెన్యూ నమోదు చేస్తున్న దిగ్గజ టెలింకా సంస్థగా జియో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ పేరిట ఉన్న రికార్డ్‌ను దాటేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తే మరిన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూల కోసం రావొచ్చంటున్నారు.