జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రంగారావుపేట గ్రామ అటవీ శివారులో చిరుత పులి సంచరిస్తుందని దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. చిరుత పులి ఎక్కడ తమ గ్రామాలవైపు వస్తుందో, ఎవరికి హాని తలబెడుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారావుపేట గ్రామ సమీపాన గల మొక్క జొన్న తోటలో కాపలాగా పెంపుడు కుక్కని ఉంచారు. శనివారం అర్ధరాత్రి సమయం లో చిరుత పులి వచ్చి కుక్క పై దాడి చేసి చంపి తిన్నదని తోట యజమాని రమేష్ అదే రాత్రి భయం తో ఇంటికి వెళ్లి పోయాడు.
ఆదివారం ఉదయం వెళ్లే సరికి కుక్క ని చంపి పీక్కు తిని కొద్దీ బాగాన్ని వదిలేసి వెళ్ళింది. వెంటనే అతను ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, చచ్చి పడి ఉన్న శునకాన్ని పరిశీలించాడు. అంతేగాక, చుట్టుపక్కల గల పరిసర ప్రాంతాలను సైతం పరిశీలించాడు. అక్కడ కాలి ముద్రలు కనబడడంతో దాన్ని సేకరించి, ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు. సోమవారం ఉదయం మళ్ళీ వెళ్లి చూసే సరికి మిగతా భాగం కూడా ఆదివారం రాత్రి వేళ వచ్చి తినిపోయిందని నిర్ధారించారు.ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్లు పద్మా రావు, చైతన్యశ్రీలు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఐతే, కాలి ముద్రలను బట్టి చూస్తే కచ్చితంగా చిరుత పులి సంచరిస్తున్నట్లు ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.