ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు బియ్యం ఎగుమతి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.అభివృద్ధి చెందిన భారతదేశం సాధించడానికి 2024 సంవత్సరం ప్రాతిపదికగా మారిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచి వారిని స్వావలంబన చేసే దిశగా విశేష కృషి జరిగిందన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో 2024వ సంవత్సరం అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్య సాధనకు పునాదిగా మారిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ అన్నారు. గత పదేళ్లలో వ్యవసాయ రంగంలో అపూర్వమైన విజయాలు సాధించామన్నారు. వ్యవసాయం, రైతులకు సంబంధించిన అనేక ముఖ్యమైన బహుమతులను ప్రధాని ప్రతి మంత్రివర్గానికి అందించారన్నారు. రైతులకు సేవ చేయడమే మోదీ ప్రభుత్వానికి దేవుడి పూజతో సమానమన్నారు. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ విడుదలతో ప్రధానమంత్రి తన మూడవ దఫాను ప్రారంభించి 9.26 కోట్ల మంది రైతులకు నేరుగా రూ.20 వేల కోట్లు పంపారని తెలిపారు. అంతేకాకుండా, 109 వాతావరణ అనుకూల రకాల పంటలను రైతులకు అంకితం చేశారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25 కోసం 14 ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధరను పెంచడానికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.
బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించామని, బాస్మతియేతర వైట్ రైస్ వ్యాపారంపై భారత్-ఇండోనేషియా మధ్య ఎంఓయూ కుదిరింది. భారతదేశం ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల బాస్మతియేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రూ. 69,515.71 కోట్ల వ్యయంతో 2025-26 వరకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కొనసాగించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024లో 4 కోట్ల మందికి పైగా రైతులు లబ్ది పొందారు, ఈ పథకాన్ని 2026 వరకు పొడిగించినట్లు శివరాజ్ సింగ్ వెల్లడించారు.
ఈ నిర్ణయం 2025-26 నాటికి దేశవ్యాప్తంగా రైతులకు ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను నష్టపరిచేందుకు సహాయపడుతుంది. ఇంకా, పథకం అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల పారదర్శకతగా పరిష్కారం దొరుకుతుందన్నారు. అలాగే, రూ. 824.77 కోట్ల కార్పస్‌తో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫండ్ (FIAT) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. ఈ ఫండ్ YES-TECH, WINDS వంటి సాంకేతిక కార్యక్రమాలకు అలాగే పథకం కింద పరిశోధన, వ్యవసాయాభివృద్ధి అధ్యయనాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగించడం జరుగుతుందన్నారు.
సాంకేతికత ఆధారిత దిగుబడి అంచనాలకు కనీసం 30 శాతం వెయిటేజీతో దిగుబడి అంచనా కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ప్రస్తుతం తొమ్మిది ప్రధాన రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో ఇతర రాష్ట్రాలను కూడా వేగంగా చేర్చుతున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. YES-TECH విస్తృత అమలుతో, పంట కోత ప్రయోగాలు, సంబంధిత సమస్యలు క్రమంగా ముగుస్తాయని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.