ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం బ్యాక్‌వాటర్‌తో తెలంగాణాలో రైతులకి ముప్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 05, 2025, 03:57 PM

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్‌తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. ఐఐటీ హైదరాబాద్‌తో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్దేశించారు. శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌తో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయించాలన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ఠ నీటిమట్టం దాకా నీటిని నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలోని ముర్రేడువాగు, కిన్నెరసాని నదులతో పడే ప్రభావంపై సర్వే చేసి, ముంపు ప్రాంతాలను గుర్తించడానికి ఆంధ్ర ముందుకొచ్చిందని అధికారులు సీఎంకు నివేదించారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంటే.. కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల నీరు గోదావరిలోకి సాఫీగా ప్రవహించదని, దీంతో ఈ వరద పంట పొలాలను ముంచెత్తుతుందని పేర్కొన్నారు. దీనిపై సర్వే చేసి చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చిందని, ఆ ఆదేశాలకు అనుగుణంగా నాలుగుసార్లు కేంద్ర జలవనరుల సంఘం సాంకేతిక కమిటీ సమావేశమయిందని వివరించారు.పోలవరం బ్యాక్‌వాటర్‌తో 954 ఎకరాలు ముం పునకు గురవుతాయని, అంతేకాకుండా భద్రాచలం ఆలయంతోపాటు మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంట్‌పై ప్రభావం పడే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com