ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కనీస పెన్షన్ రూ.5 వేలకు పెంచాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి. దీని ద్వారా కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్రానికి సూచించాయి. అలాగే త్వరితగతిన 8వ పే కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. వీటితో పాటుగా 2025- 26 వార్షిక బడ్జెట్‌లో సూపర్ రిచ్ (అత్యంత ధనవంతులు)పై అధిక ట్యాక్సులు విధించాలని కోరాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సోమవారం జరిగిన బడ్జెట్ 2025 సన్నాహక సమావేశంలో ఈ మేరకు పలు డిమాండ్లను కేంద్రం ముందుకు తీసుకొచ్చారు ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు.
ప్రధానంగా మధ్య తరగతికి ఊరట కల్పిస్తూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షలకు చేయాలని కేంద్రాన్ని కోరాయి ట్రేడ్ యూనియన్లు. గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత పథకాన్ని తీసుకురావాలని, దీంతో వారి భవిష్యత్తుకు భద్రత లభిస్తుందని విజ్ఞప్తి చేశాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశాయి. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వెంటనే ఆపాలాని కేంద్రాని కోరినట్లు మీడియా సమావేశంలో తెలిపారు యూనియన్ల ప్రతినిధులు. ఈ సారి బడ్జెట్‌లో సూపర్ రిచ్ వ్యక్తులు, కుటుంబాలపై 2 శాతం అదనపు ట్యాక్స్ విధించాలని, అలా వచ్చిన డబ్బులను అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని కోరినట్లు టీయూసీసీ జాతీయ కార్యదర్శి ఎస్‌పీ తివారీ తెలిపారు. వ్యవసాయ రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు.
కనీస పెన్షన్ రూ. 1000 నుంచి రూ. 5 వేలకు..
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ - 95 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస పెన్షన్ రూ. 1000 నుంచి రూ. 5 వేలకు పెంచాలని జాతీయ మజ్దూర్ సంఘ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నార్త్ జోన్ పవన్ కుమార్ కోరారు. అలాగే పెన్షన్ వీడిఏకు లింక్ చేయాలని తెలిపారు. రూ. 10 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించడంతో పాటుగాపెన్షన్ మొత్తంపై పూర్తిగా ఇన్‌కమ్ ట్యాక్స్ తొలగించాలని కోరినట్లు చెప్పారు. 7వ పే కమిషన్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు దాటిపోయిందని, 8వ వేతన సంఘాన్ని సత్వరమే ఏర్పాటు చేయాలన్నారు. 1980ల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 21 లక్షలుగా ఉండగా 2023- 24 నాటికి అది 8 లక్షలకు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.