హైదరాబాద్ మల్లాపూర్‌లో జీహెచ్ఎంసీ వాహనం రోడ్డుపై బీభత్సం సృష్టించింది. నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్‌లో జీహెచ్ఎంసీ క్లీనింగ్ వాహనాన్ని డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి.. పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లాడు. అయితే.. వాహనాన్ని పూర్తిగా ఆపేయకుండా.. ఇంజన్ ఆన్‌లోనే ఉంచాడు. ఏటూ వెళ్లదన్న ధీమాతో డ్రైవర్ దుకాణంలోకి వెళ్లాడు. అయితే.. అదేంటో కానీ ఆ వాహనం కదిలి.. మలుపు తీసుకుని ఎదురుగా ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లటం ప్రారంభించింది. ఈ విషయాన్ని డ్రైవర్‌తో పాటు అక్కడున్న చాలా మంది గమనించారు.
వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. వాహనం ముందుకు వెళ్లి ఆపేందుకు తన శాయాశక్తులా ప్రయత్నించాడు. కానీ.. అది వాహనం, ఇతను మనిషి కావటంతో.. ముందుకే దూసుకెళ్లింది. అక్కడే పార్కింగ్‌లో ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి, ద్విచక్రవాహనాలు, కారును ఢీకొచ్చి అక్కడ ఆగిపోయింది. ఈ క్రమంలో దానికి ఎదురుగా వెళ్లిన డ్రైవర్ తీవ్రగాయాలపాలయ్యాడు. వేరే వ్యక్తి వాహనంపైకి ఎక్కి.. దాన్ని ఆప్ చేయటంతో.. వాహనం శాంతించింది. ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసం కాగా.. కారుకు కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన సీసీకెమెరా దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.