హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రన్నింగ్‌లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. అందులో నుంచి బయటపడలేక సజీవదహనం అయ్యారు. ఈ ఘటన.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఘన్‌పూర్ వద్ద జరిగింది. అయితే.. వరంగల్ నుంచి హైదరాబాద్‌వైపు అతివేగంగా వెళ్తున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. కారు వేగంగా ఉండటంతో.. కంట్రోల్ చేసి పక్కకు ఆపేలోపు మంటలు పూర్తిగా వ్యాపించాయి. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి ఫైర్ ఇంజన్ వచ్చేలోపు స్థానికులు.. కారులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పేసింది. అయితే.. అప్పటికే కారులో ఉన్న వ్యక్తులు మాంసపు ముద్దలుగా మారిపోయారు. చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు తమ కళ్ల ముందే మంటల్లో ప్రాణాలు కోల్పోవటం చూసి.. స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామని బాధపడ్డారు.
మృతులు ఉప్పల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. అందులో ఒకరు.. నారపల్లికి చెందిన శ్రీరామ్ (26). హోల్ సేల్ సైకిల్ షాప్ నిర్వహిస్తాడని తెలిసింది. కారులో మరొకరు మహిళగా అనుమానిస్తున్నారు. కారులో CNG సిలిండర్ ఉండటంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషాద సమాచారాన్ని తెలియజేయగా.. కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.