చైనాలో కొత్తరకం వైరస్ వ్యాప్తి మరో ప్రపంచ మహమ్మారిగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హ్యూమన్ మెటానిమోవైరస్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇతర దేశాల్లోనూ ఈ వైరస్ అడుగుపెట్టినట్టు నివేదికలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మలేషియాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. స్ట్రెయిట్ టైమ్స్ ప్రకారం.. వైరస్ నియంత్రణకు మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీచేసింది. సబ్బుతో తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, జలుబు దగ్గుతో బాధపడేవారు మాస్క్‌లు ధరించాలని సూచించింది.
ప్రజల తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రిస్క్ ఎక్కువ ఉన్న దేశాలకు ప్రయాణాల విషయంలోనూ పునరాలోచించాలని పేర్కొంది. అయితే, హెచ్ఎంపీవీ కొత్తరకం వ్యాధి కాదని తెలిపింది. 2001లో కనుగొన్న ఈ వైరస్ న్యుమోవిరిడే కుటుంబానికి చెందింది.. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) కూడా అదే కుటుంబానికి చెందింది. ఇది సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలు ఉండే ఇది ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్.
ఇన్‌ఫ్లుయోంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి ఇతర వ్యాధులతో పాటు ప్రస్తుతం హెచ్ఎంపీవీ కేసులను చైనా ఎదుర్కొంటోంది. కొన్ని ప్రాంతాల్లోని ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోయినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, చైనా అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. అన్ని వయసుల ప్రజలకు ఈ వైరస్ ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు చిన్నారులు ఈ వైరస్‌కు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. వ్యాధినిరోధకత తక్కువగా ఉన్నవారు ఆస్తమా బాధితులకు ముప్పు ఎక్కువే.
ఈ వైరస్‌కు కరోనా వైరస్ కంటే చాలా వేగంగా వ్యాపించగల సామర్థ్యం ఉన్నట్లు చైనాలోని పరిస్థితులు చెబుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో కోవిడ్-19 వ్యాప్తి పెద్దగా లేదు, కానీ ఈ హెచ్ఎంపీవీ వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు. కరోనా కంటే ఇది ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు.