ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఎంపీవీ కేసులు ఏం లేవు అని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. ఇప్పటి వరకూ మన భారత దేశంలో కానీ, ఏపీలో కానీ ఎక్కడా ఇలాంటి కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని అన్నారు. చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవు అని చెప్పారు. ఈ వైరస్ కారణంగా ప్రజలు ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. న్యూమో విరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వైరస్ సోకిన వారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు.