మంత్రి నారా లోకేష్ ఆదివారం విశాఖ రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం జరిపే అవకాశమున్నట్లు సమాచారం. కాగా ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా ఇంచార్జ్‌గా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. మోదీ సభ సక్సెస్ కోసం లోకేష్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదివారం విశాఖకు వెళ్లనున్న మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. అధికారులు, స్థానిక నేతలతో చర్చలు జరుపుతారు. కాగా ఈనెల ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పలువురు ఐఏఎస్ అధికారులను ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్, వీఎంఆర్‌డీఎ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్‌తోపాటు ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్, పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంతకుమార్‌రెడ్డిలకు ప్రధాని పర్యటనకు సంబంధించి పలు బాధ్యతలు అప్పగించారు. వీరు కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరో పది మంది డిప్యూటీ కలెక్టర్లు, 20 మంది తహసీల్దార్లు, ఇంకా రవాణ, పౌర సరఫరాలు, రోడ్లు, భవనాల శాఖల నుంచి అధికారులను నియమించారు. జన సమీకరణ, బహిరంగ సభ, వేదిక, గ్యాలరీల ఏర్పాటు, ఇతర పనుల పర్యవేక్షణ నిమిత్తం మొత్తం 42 కమిటీలు వేశారు. ప్రతి కమిటీకి జిల్లా అధికారి ఒకరు నేతృత్వం వహిస్తారు.