సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు, ఉచిత ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్(ఆశా) అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్ తెలిపారు. శనివారం విజయవాడలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రూ.3 వేల కోట్లు బకాయిలున్నాయని తెలిపారు. ఆస్పత్రల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉచిత వైద్య సేవలు అందించలేకపోతున్నామని చెప్పారు. బకాయిల వల్ల నెట్‌వర్క్ ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాలు, రసాయనాల సరఫరాను వ్యాపారులు నిలిపివేశారన్నారు. ఓవర్ డ్రాఫ్ట్ అవడంతో బ్యాంక్‌లు కూడా సహకరించడం లేదని చెప్పారు. దీంతో 6వ తేదీ నుంచి వైద్య సేవలు నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామన్నారు. బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈవో ఫోన్‌లో చెప్పారని, సోమవారం చర్చలకు రావాలన్నారని తెలిపారు. ప్రభుత్వంపై గౌరవంతో 6వ తేదీ నుంచి ఓపీ, ఈహెచ్‌ఎస్ సేవలు మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.