ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా ఈనెల 7న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ పిలుపునిచ్చారు. అనంతపురం సీపీఎం జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విభజన చట్టంలో భాగంగా కడపలో ఉక్కు పరిశ్రమ ను స్థాపించాల్సి ఉండగా, ఇపుడు కడప ఉక్కు మా పరిశీలనలో లేదని చేతులెత్తే యడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులివ్వకుండా మోసం చేసిన బీజేపీ ప్రస్తుతం తాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆంధ్రా ఎంపీల మద్దతుతోనే అన్న విషయం మరువరాదన్నారు. తెలుగుదేశం, జనసేన మద్దతుతో మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉండికూడా రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయగలుగుతోందంటే అందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలే కారణమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సుమారు రెండేళ్లుగా ప్రజలు పోరాడుతున్న విశాఖపట్నానికి ప్రధాని రావడం ఆంధ్రులను అగౌరపరచడమే నన్నారు. రాష్ట్రంలోని ఓడరేవులు, రోడ్లు, రైల్వేలైన్లను ప్రభుత్వం అదానీ కంపెనీకి అప్పగిస్తోందని ఆరోపించారు. అందుకే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ పర్యటనను నిరసిస్తూ జిల్లాకేంద్రంలో ఈనెల 7న నిరసనలు చేపడతామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాలరంగయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగేంద్రకుమార్, సావిత్రి, శ్రీనివాసులు, రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తిరాజు, జిల్లా కమిటీ సభ్యులు నాగమణి, రామాంజినేయులు, తరిమెల రాజు, వెంకటనారాయణ, నిర్మల, అచ్యుతప్రసాద్, మల్లికార్జున, మారుతీప్రసాద్, ముత్తుజా, ఓతూరు పరమేష్, కసాపురం రమేష్ పాల్గొన్నారు.