గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై మాచర్లలో దాడి చేసిన వైసీపీ నేత తురకా కిశోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురకా కిశోర్... వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడనే పేరుంది! గతంలో వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని కిశోర్ అనేక దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అరెస్ట్ భయంతో తురకా కిశోర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే, అతడి కోసం గాలిస్తున్న పల్నాడు పోలీసులు తాజాగా హైదరాబాదులో అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసులో గత ప్రభుత్వ హయాంలోనే తురక కిశోర్ ను అరెస్ట్ చేసినప్పటికీ, ఒక్కరోజు వ్యవధిలోనే అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు.