దేవాలయాలపై దాడులు పెరిగాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పారు. ఆలయాల్లో అన్యమతస్తులు పెరిగారని ఆరోపించారు. గన్నవరం, కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో ఇవాళ (ఆదివారం) హైందవ శంఖారావం సభ జరిగింది. ఈ సభలో వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. ఈ సభలో దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మం, సంప్రదాయాలను కాపాడాలని చెప్పారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలని పురందేశ్వరి పేర్కొన్నారు.1987లో చేసిన దేవాదాయ, ధర్మాదాయ చట్టం మన ఆలయాల పాలిట శాపంగా మారిందని మాజీ సీఎస్, ఎల్వీ.సుబ్రహ్మణ్యం ఆరోపించారు. మన ఆలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని తెచ్చి అర్చకుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. 1987లో తెచ్చిన చట్టం మన ఆలయాల ధ్వంసానికి కారణమైందని ఎల్వీ.సుబ్రహ్మణ్యం అన్నారు.