ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. తడిగుడ్డలతో గొంతులు కోసే నైజం నారా చంద్రబాబు సొంతమని అన్నారు. ఈ దేశంలోనే రాజకీయాల్లో అత్యంత విశ్వాసఘాతకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు మాత్రమేనని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కక్షలు, కుట్రలు, మోసాలతోనే నిండి ఉందని అన్నారు. అయన మాట్లాడుతూ.... పత్రికల్లో కొన్ని కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి.
తెలుగుదేశంకు బాకా ఊదే పత్రికలో ప్రధాన శీర్షికగా కక్షసాధింపు అనేది నా లక్ష్యం కాదు అని చంద్రబాబు అన్నట్లుగా రాశారు. దీనిని చూసి ఆశ్చర్యం వేసింది. నిర్ఘాంత పోయే అంశం ఇది. ఈ సందర్బంగా పాత సినిమాలో ఒక పాట గుర్తుకువస్తోంది. ఆడవారి మాటలకు... అర్థాలే వేరులే అని...అన్నట్లుగా చంద్రబాబు గారి మాటలకు అర్థాలే వేరులే... అర్థాలే వేరులే... అవునంటే కాదనిలే... కాదంటే అవునని లే... అనే అన్వయించుకోవాలి. చంద్రబాబు నాకు కక్ష లేదు అంటే... చాలా కక్ష ఉందని అర్థం... నేను నిప్పులాంటి మనిషిని అంటే.. ఆయన తుప్పు అని అర్థం. నేను అసలు తప్పే చేయను అంటే... నిత్యం తప్పులే చేస్తాను అని అర్థం. నా అంత విశ్వసనీయుడు ఎవరూ లేరు అని అంటే... అంత విశ్వాసఘాతకుడు ఈ దేశంలోనూ, రాజకీయాల్లోనూ ఎవరూ లేరని అర్థం. అందరినీ విశ్వసిస్తాను అంటే.. ఎవరినీ నమ్మనూ అని అర్థం. నేను అక్రమాలు చేయను అంటే... రోజూ అక్రమాలే చేస్తారని అర్థం అని తెలియజేసారు.