రీవెరిఫికేషన్ పేరుతో వైద్య బృందాలను ఇంటింటికీ పంపి పింఛన్ లబ్దిదారుల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే 3.5 లక్షల పెన్షన్లు తొలగించారని వెల్లడించారు. రాజకీయ కక్షతో పెన్షన్లు తొలగిస్తే ఊర్కోబోమని.. హైకోర్టును, అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.
వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. దివ్యాంగులు, దురదృష్టవశాత్తు ప్రమాదమో, అనారోగ్యంతోనో బాధపడే వారిని జాలి, దయతో పింఛన్లు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం పింఛన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారిపై పగ సాధిస్తున్నట్లుగా ఉంది. అర్హతే ప్రామాణికంగా గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మేం పింఛన్లు అందజేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ జన్మభూమి కమిటీల ద్వారా అందించే పాత విధానానికి కొత్త సంవత్సరంలో ప్రారంభించడం దారుణం అని అన్నారు.