మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం అభిమానులను కలచివేసింది. అనారోగ్య సమస్యలతో మహారాష్ట్రలోని థానేలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన 52 ఏళ్ల వినోద్ కాంబ్లీ క్రమంగా కోలుకుంటున్నారు. యూరినరీ ఇన్ఫెక్షన్ ఇతర సమస్యలతో డిసెంబర్ 21న ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన మెదడులో రక్తం గడ్డ కడుతోందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స అందించాల్సి ఉందని చెప్పారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వినోద్ కాంబ్లీ.. ఆసుపత్రిలో డ్యాన్స్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కూడా డ్యాన్స్ చేసినట్లు వీడియోలో కనిపించింది. చక్ దే ఇండియా పాట పాడుతూ.. ఆయన ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు. అనంతరం క్రికెట్ షాట్ కూడా ఆడినట్లు ఆయన ఫోజులిచ్చారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కాంబ్లీ కోలుకుంటున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి సాధారణ స్థితికి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది. అతడి ఆరోగ్య ఖర్చులను కూడా భరించేందుకు అతడి సహచర ఆటగాళ్లు ముందుకొచ్చారు. దీంతో కోలుకునే వరకు ఆయన ఆస్పత్రిలోనే ఉండనున్నారు.
సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ మంచి మిత్రులు. 1990ల్లో అంతర్జాతీయ క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన వినోద్ కాంబ్లీ మేటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఒక దశలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కంటే ప్రతిభావంతమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన కాంబ్లీ కెరీర్.. ఆ తర్వాత గాడి తప్పంది. మద్యానికి బానిసై.. తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. 2012లో కాంబ్లీ ఆరోగ్యం బాగా క్షీణించింది. 2013లో గుండెపోటుకు గురైన ఆయనకు వైద్యులు సర్జరీ చేశారు. భారత్ తరపున వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. మొత్తంగా 3,561 పరుగులు స్కోరు చేశాడు. గతంలో మాదిరిగా తాను.. తన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించనని, డాక్టర్లు చెప్పినట్లు నడుచుకుంటానని కొన్ని రోజుల కిందట కాంబ్లీ చెప్పారు.